పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 11


దోర్గర్వంబునం దెచ్చుటయును జంభహిరణ్యకశిపులయుద్ధసంరంభంబును
నారంభోరువువలనఁ బ్రహ్లాదు నుదయంబును నతండు దైత్యకుమారులకు
విష్ణుభక్తిప్రకారం బుపదేశించుటయును గనకకశిపుండు తనతనయుం గనలి
పలుకుటయును శ్రీనృసింహావతారంబును హిరణ్యకశిపువిశసనంబును మొద
లుగాఁ గలుగుకథావధానంబులు విని యక్కథకునకు శౌనకాదిమునీంద్రు
లిట్లనిరి.

70


ఉ.

శ్రీనరసింహమూర్తి సురసిద్ధగణంబులు సన్నుతింప న
ద్దానననాథువక్షము శితత్రిదశేశ్వరవజ్రనిష్ఠురా
త్యానతవిస్ఫురన్నఖచయాగ్రముల న్విదళించి యంతఁ ద
త్సూనునిఁగాచి యెచ్చటికిఁ జువ్వున నేగెనొకో యకల్మషా.

71


గీ.

విష్ణుకథలు తొల్లి వినినవేనియు నిత్య, నూతనోత్సుకంబు నూలుకొలిపి
పరిణమింపఁజేయు హరిణాంకకిరణంబు, లభినవములుగావె యనుదినంబు.

72


క.

భవదీయముఖవినిర్గత, వివిధకథామృతము గ్రోలి వివశములై మా
చెవు లిపుడుఁ దనివిఁబొందవు, భవగుణరహితప్రచార పరమోదారా.

73


వ.

అని పలుకు నమ్మహాతపోధనుల మునుమినుకులంబోని సూక్తిజాలంబు లాలించి
సహర్షోత్కర్షంబుగ రోమహర్షణుం డమ్మహాత్ముల కి ట్లనియె.

74


క.

నారాయణపదయుగళాం, భోరుహసద్భక్తు లఖిలపూజ్యచరిత్రుల్
మీ రెఱుఁగని విష్ణుకథా, ప్రారంభము లున్నవే మహామతులారా.

75


గీ.

అయిన నేమి యుష్మదంఘ్రిపదార్చనా, ఫలితబుద్ధి సిద్ధిఁ బరఁగి యేను
నృహరిదివ్యదేహనిర్యాణ[1]వృత్తంబు, వినినయంత మీకు విన్నవింతు.

76


నారదుఁ డింద్రునికడకు వచ్చుట

వ.

అది యెట్టి దనిన నొక్కనాఁడు మహేంద్రుండు దేవగంధర్వసిద్ధసాధ్యరక్షో
యక్షదిక్పాలకకిన్నరకింపురుషగణంబులును రంభాదిసురకామినులుం గొలువ
నిండుకొలువున కేతెంచి యందు రత్ననిర్మితం బైనసింహాసనంబున సమా
సీనుండై యున్నసమయంబున సమరభోజనప్రయోజనవిశారదుం డగు నార
దుం డేతెంచిన నమ్మహాత్ముని నెదుర్కొని యర్ఘ్యపాద్యాదు లర్పించి
సముచితాసనంబున నుపవిష్టుం జేసి కృతాంజలియై యిట్లనియె.

77


క.

భవదీయపాదరేణువు, దవిలిన మద్భవన మెల్ల ధన్యత నొందెన్
వివిధశుభాస్పద మయ్యెను, దివమును ద్వద్దర్శనమున దివ్యమునీంద్రా.

78
  1. వృత్తమే - మూ.