పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 4-5

నారసింహపురాణము. ఆ-1

177


క.

ఆర్వేలకులోజ్జ్వలునకు, గర్వితరిపుగహనదహనకనదనలునకున్
సర్వంసహామహాధిక, ధూర్వహబలునకును విగతదుశ్శీలునకున్.

61


క.

ఖండితఘనదుష్కృతికినిఁ, బండితజేగీయమానపరహితకృతికిన్
గండస్థలమండితమణి, కుండలవితతికి నిరస్తకుహనామతికిన్.

62


క.

పాత్రచరితాశ్వలాయన, సూత్రున కధికతరసుకృతశుభగుణచంచ
ద్గాత్రునకును బుధనుతచా, రిత్రున కశ్రాంతకృతహరిస్తోత్రునకున్.

63


క.

శ్రీవరపాదాంభోరుహ, సేవాదత్తావధానచిత్తాబ్జునకున్
భావభవసదృశరూవధు, రావంచితనిష్కళంకరాకాబ్జునకున్.

64


క.

హిమమండలరిపుమండల, సమచండిమభీమధామసంస్త్యాయునకున్
రమణీయసురమణీనిక, రమణిధ్యేయునకు దానరాధేయునకున్.

65


క.

నరసప్రధాసురంగన, కరినృపదుర్మంత్రిగర్వహరిచంగునకుం
గరుణాగుణసంగునకును, బరమతరపరోపకారఫలితాంగునకున్.

66


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నే రచియింపం బూనిన యుత్తరనరసింహపురా
ణంబునకుఁ బ్రారంభం బెట్టి దనిన.

67


కథాప్రారంభము

ఉ.

పుణ్య మగణ్యయాగఫలభోగనిరస్తసమస్తదేవకా
ర్పణ్యము ముక్తియౌవతశరణ్య ముదగ్రసమగ్రబోధదా
క్షిణ్య మశేషకాననవిశేషవరేణ్యము నైన నైమిశా
రణ్యము చూడ నిం పగుఁ దరణ్యభిభావసరణ్యగాగ్ర మై.

68


సీ.

ఏయరణ్యమునందు నింద్రాదిదేవతాతతి సకుటుంబమై తరలకుండు
నేయరణ్యమునందు నిసుమంత జాతివైరములేక సత్త్వజాతములు మెలఁగు
నేయరణ్యమునందు నిందుశేఖరధాతృకమలాక్షముఖులు సౌఖ్యంబు గాంతు
రేయరణ్యమునందు నాయురారోగ్యాభివృద్ధిప్రదాయి వివేక మడరు
నేయరణ్యంబునందు భక్తేప్సితార్థ, సిద్ధికరి యైనయోగలక్ష్మియుఁ జెలంగు
నట్టి శ్రీనైమిశారణ్య మఖలమౌని, విహరణస్థానియై యభివృద్ధి దనరు.

69


వ.

ఆనైమిశారణ్యంబునం బ్రబోధనిస్తంద్రు లగుమహామునీంద్రులు నఖిలకళ్యాణా
కర్షణుం డగురోమహర్షణువలన హిరణ్యకశిపుజన్మంబును నతనితపోమహత్త్వం
బును జంభునికూఁతు రైనయంభోరుహాక్షిఁ గయాధు వనుదాని స్వయంవరం
బును మొక్కలంబున నక్కన్యకారత్నంబు హిరణ్యాక్షపూర్వజుం డఖర్వ