పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 5-6

నారసింహపురాణము. ఆ - 5

331


మ.

వికలాంగు ల్విషమప్రచారులు రుజావిద్దుల్ వినేత్రుల్ జడుల్
వికటాచారులు విత్తవర్జితులు మద్వేలక్షుభాపీడితుల్
సకలాన్నగ్రసనాభిముఖ్యనిరతుల్ చండాలకల్పుల్ రమా
ముకురాస్యారమణా నినుంగనని దుమ్ముల్ ధర్మసంస్థాపకా.

100


సీ.

సింహాసనస్థులై సిరుల నించినవారు భోగసంపదలచేఁ బొదలువారు
బహుపుత్రపౌత్రలాభము గల్గి మనువారు విద్యానవద్యులై వెలయువారు
సప్తసంతానప్రశస్తి గల్గినవారు ప్రత్యర్థిసార్థంబుఁ బఱపువారు
తాపత్రయవ్యథోవృత్తి నెఱుంగనివారు నిష్టాన్నదాతలై యెసఁగువారు
భవదుదారాంఘ్రిభక్తిసంపన్ను లగుచు, మించి తొలిమేన మిమ్ము సేవించినారు
వామన ముకుంద గోవింద వాసుదేవ, నలినదళనేత్ర పావనోన్నతచరిత్ర.

101


సీ.

నారాయణాయ కిన్నరవరోరగయక్షసేవితాయ మునీంద్రభావితాయ
నారాయణాయ నానాభవక్లేశవిదారణాయ సమస్తకారణాయ
నారాయణాయ పన్నగరాజపర్యంకబంధురాయ విభిన్నసింధురాయ
నారాయణాయ గండస్థలాంచితరత్నకుండలాయ మహాస్త్రమండలాయ
జలధరశ్యామవర్ణాయ శాశ్వతాయ, కంజహస్తాయ శస్తాయ గతభవాయ
తేనమో యనిపల్కు సాత్త్వికుల కిహముఁ, బరముఁ గరతలమాణిక్యపరికరంబు.

102


క.

దండించు నన్ను నెన్నే, దుండగములు చేసినాఁడ ధూర్జటిసఖ దో
ర్దండశితచక్రధారా, చండిమచే ననుడు భుజగశయనుఁడు నగుచున్.

103


క.

ఆలింగనంబు చేసెఁ గృ, పాలింగితహృదయుఁ డగుచు నసురేంద్రసుతున్
లోలవిలోచనపాండుర, నాళీకములందుఁ గరుణ నవకము మీఱన్.

104


క.

హరిగాత్రస్పర్శంబున, సురవైరిమనంబు బోధశోభిత మయ్యెం
దరుణారుణకిరణకిరణ, పరిణతి వికసనమునొందు పద్మమువోలెన్.

105


వ.

అప్పు డప్పుండరీకాక్షుండు చక్షుశ్రవఃపరివృఢసింహాసనాసీనుం డై హిరణ్య
కశిపుసూనుం దనకుడితొడమీఁదఁ గూర్చుండ నిడికొని తదీయకపోలస్థలం
బులు పుడుకుచు లజ్జావైవర్ణ్యంబు నుజ్జగింపించి బొజ్జగిలిగింత లిడుచుఁ
గొడుకు ముద్దాడువడు వడరం గొంతసేపు వింతవిలాసంబుల భాసమానుం
డై యయ్యమరాంతకున కి ట్లనియె.

106


క.

ఏ మీవు చేయుదువు సు, త్రామాహితదుష్టజనపరంపరకఱపుల్
నీమది తమోమయంబుగ, నీమాడ్కి నొనర్చె దీని కేటికి వగవన్.

107