పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33 సంచిక నారసింహపురాణము - ఉపోద్ఘాతము.

ముందుగా భాగవతస్కంధము లాంధ్రీకరించినట్లు స్పష్టమగుచున్నది. వరాహపురాణమత్స్యపురాణము లంతకుఁ బూర్వమే రచింపఁబడియున్నయెడల వానిప్రస్తావ మిం దేల చేయఁబడ లే దని యొకశంక పొడమును. పోనిండు. భాగవతస్కంధములకును నారసింహపురాణమునకును బరమందే వరాహమత్స్యపురాణములు విరచింపఁబడిన వసుకొంద మన్నచో నాగ్రంథములు రచియించునంతకాలమువఱకు నీనారసింహపురాణము కవిచే నెవ్వరిపేర నంకితము చేయఁబడక మిగిలియుండి యిట్లేల కవిపుత్రునిచేఁ గృతియీయఁబడు నని సంశయింపవలసివచ్చును. ఇట్లు సంశయాస్పద మగు నేతద్గ్రంథరచనాక్రమమును గూర్చి విశేషతర్కము లొనరింపవలసిన పనిలేదు. కాని గ్రంథకర్తచే నెవ్వరికి నంకితము చేయఁబడక మిగిలియున్న దగుటచేతను, నీకవిచేతనే రచియింపఁబడిన యితరగ్రంథములయందలి కవిత్వముకంటె నిందలికవిత్వము కొంత ప్రౌఢముగాఁ గాన్పించుచుండుటచేతను నీనారసింహపురాణ మీకవిగ్రంథము లన్నిటిలోను గడపటి దని సంభావించుకొని సంశయవిచ్ఛేదకమైన సందర్భాంతరము సమకూరువఱకును సంతోషింపవచ్చును.

భారతభాగవతరామాయణాదులవలెనే యిదియును గథాసందర్భమున సంస్కృతమూలము ననుసరించి యధేష్టముగాఁ దెలుఁగు సేయఁబడినట్లు కనుపట్టుచున్నది. కాని యెంతవఱకు మూలానుగుణముగా నున్నదో చూచి వివరించుటకు నాకుఁ దగిన యవకాశము చిక్కినది కాదు. ఇందలికథ యెఱ్ఱాప్రెగ్గడ నారసింహపురాణమునందలి కథ కుత్తరభాగమని తోఁచుచున్నది.

ఈ గ్రంథమునందలి కవిత్వము నిరర్గళమైన ధారగలదై ద్రాక్షాపాకమునఁ బడి చక్కఁగా నుండును.

చ. అలఘుభుజాబలప్రథితు లాశరపుంగవు లుగ్రసాధనం
బుల నరకేసరిం బొదువఁ బూనిన యంతనె తన్నృసింహుచూ
పుల యెఱమంటలం జిమిడిపోయిరి జీర్ణము లైరి జీవముల్
తొలఁగిలి తూలి రోటఱిరి తొట్రిలి వ్రాలిరి కూలి రందఱున్. ప్ర.ఆ.122