పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


"మనినఁ బ్రహ్లాదుండు ప్రాంజలియై యుత్ఫుల్లదృష్టిచేఁ జతుర్భుజుం
జూచి" భవత్పదారవిందంబులు చూచుకంటె నాకు మరియు నొక
వాంఛ గలదె? బ్రహ్మాదిదుర్లభంబైన యుష్మత్పదాంభోజదర్శ
నామృతంబున మచ్చిత్తంబు తృప్తిం బొందదు; మరియు నొకటి గల్గెనేని
ప్రార్థించెదఁ; గల్పాయుతశీతంబులనైన యుష్మత్సాక్షాత్కారాహ్లాద
సముద్రతరంగంబుల నోలలాడునాకు నితరసుఖంబులు రుచియిం
పవు గాన నే నితరంబులు వేడనొల్ల;" నని విన్నవించిన సుధారసప్రవా
హంబులగు వచనంబుల మోక్షలక్ష్మీసామ్రాజ్యంబునందుఁ బట్టంబు
గట్టి భగవంతుం డిట్లనియె.

239


తే. గీ.

నీవు పల్కిన యట్లనే నిజము నాకుఁ
బ్రియముగా నొక్కవరము సంప్రీతి నడుగు;
మఖిలలోకంబులందు నీ యట్టి ధీర
చిత్తుఁ డెవ్వఁడు గలఁడు చర్చించి చూడ.

240


వ.

అనఁ బ్రహ్లాదుం డిట్లనియె.

241


క.

ఉరగేంద్రవేత్రనాయక
గరుడాదులలోన నొకనిఁ గానను దేవా!
కరుణించుము, నీదాసుఁడ
శరణాగతవత్సలా! ప్రసన్నాత్మ! హరీ!

242


వ.

అనిన నీశ్వరుం డిట్లనియె; “నీకు సంకటంబు ప్రాపించినయది; యేను
నిన్ను నిర్వహింపం జనుదెంచినవాఁడ; నీవు భృత్యత్వంబు వేడితివి;
నీవె నేఁగాఁ దలంచియున్నచో నిది యుచితంబె? వేరుగాఁ జూచుట
యెందులకు నేనె యెఱుంగుదు; నీవు గోరినయది మద్భక్తి; నీకుం
గోరందగినయది గాదు. నీకు స్థిరంబైనయదియె; మరియు వరం
బులు వేఁడుమని యనుగ్రహించినఁ బ్రహ్లాదుం డిట్లనియె.

243


తే. గీ.

నాథ! భవదీయపదభక్తి నాకు నిచ్చి
నాడఁవో యియ్యవో నీవు! వేఁడికొనిన;
నట్టి సద్భక్తి దొరకిన నదియె నాకుఁ
గామ గవి; యన్యవరకాంక్ష ఘనతరంబె?

244