పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనిపిస్తున్నది. కాని వాస్తవానికి నరసింహకవి ఆ పాదాన్ని హస్తములఁ బట్టి బిరబిర నార్చి ద్రిప్పి అని రచించివుంటాడని ప్రతివ్రాసిన వ్యక్తి పొరపాటున మాటలను ముందువెనుకలుగా మార్చి వ్రాశాడని భావించవలసివున్నది.

నరసింహకవి కొన్నిసందర్భాలలో అసాధారణమై ప్రాచీనకవులచేత సకృతులుగా ప్రయోగించబడి లాక్షణికులు గుర్తించనటువంటి కేవలస్వరయతిని కూడా ప్రయోగించాడు.

"తరులతాకుంజఖగమృగతతుల నడిగి
గగనభూవారిపవనతేజో౽౦తరముల."

(నార. 3-. పు. 169. ప.)

ఈ పైతేటగీతిలోని రెండవపాదంలో గగనశబ్దగతమైన తొలి 'గ' కారంలోని 'అ' కారానికి "తేజో౽౦తర" అన్నప్పుడు పూర్వరూపసంధిలో గూఢమై వున్న 'అంతర' శబ్దంలోని 'అ' కారానికి కేవల స్వరయతిగా విశేషయతి ప్రయోగం చేయబడింది.

నారదీయపురాణం 100వ పుట 35వ పద్యమయిన సీసంలోని యీ క్రింది రెండవపాదంలో

"అన్యగాథలు మాని నారాయణుని నభో
         భ్యంతరాళమున గానం బొనర్ప"

నభోభ్యంత అన్నప్పుడు 'భ్య'లోని 'య'కారానికి 'గానం' అన్నప్పుడు 'న' వర్ణంలో 'అ' కారానికి కేవలస్వరయతి ప్రయోగించబడింది. ఈసందర్భంలో అభ్యంతరశబ్దాన్ని 'అభి + అంతర' అని విభజించినప్పటికి కూడా ఉపసర్గయతి దృష్ట్యా 'అంతర' లోని అకారస్వరానికి యతివేశాడని అనుకొన్నా 'న' వర్ణంలోని కేవల అకారస్వరానికి మాత్రమే యతిమైత్రిని పాటించాడని మనం ఆమోదించకతప్పదు.

"అలఘులు వీతరాగులు ................................... లా
జలుగొన ................................................... వై
ద్యులువలె భూమిఁ ద్రిమ్మరుచుఁ బూర్ణదయాగుణవారిరాసులై.

(నార. 376. పు. 240. ప.)

అన్న చంపకమాలలో మూడవపాదంలో యతిమైత్రిలో 'ద' కార 'బ' కారాలకు అసలు సంబంధం లేనేలేదు. "ద్యు"లోని 'యు'వర్ణానికో 'ఉ'స్వరానికో "బూ" లోని 'ఊ'కారంతో కేవలస్వరయతిని నరసింహకవి ప్రయోగించాడని మనం విస్పష్టంగా గుర్తించవలసి వున్నది. ఇదేవిధంగా యీ క్రింది తేటగీతి మూడవపాదంలో,