పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామూలుగా మనం గద్యమన్నా, వచనమన్నా, ఒకటే ననుకుంటాము. రెండింటినీ పర్యాయపదాలుగా సైతం భావిస్తాము. సంస్కృతంలో సైతం యీ అభిప్రాయమే వున్నా సంస్కృతాంధ్రాలలో రెండింటా ఒకానొకపదబంధశయ్యావిశిష్టమైన వచనరచనను ప్రత్యేకించి గద్యగా పేర్కొనడం ప్రాచీనకాలంనుంచీ వున్నది. నిజానికి చెప్పాలంటే వచనమన్నా గద్యమన్నా ఒకటే కాబట్టి సంస్కృతంలో శాకుంతలాదినాటకాలలోవున్న సంభాషణారూపాలైన వచనాలను, వాక్యాలను గద్యా లనవలసి వుంటుంది. దశకుమారచరిత్ర, కాదంబరివంటి విశిష్టగద్యకావ్యాలలోని గద్యాన్ని మనం మామూలుగా గద్యమని అంటాముకాని వచనమనికూడా పేర్కొనవలసి వుంటుంది. అదే తెలుగులో మామూలుగా గ్రాంధికనాటకాలలోవుండే వచనాన్ని, చిన్నయసూరి నీతిచంద్రికలో ఉపయోగించిన విశిష్టపదగుంభనాశయ్యాభరితమైన రచననూ వచనమే అని మన మనుకుంటున్నా రెండింటిలోని భిన్నత్వాన్ని, వైశిష్ట్యాన్ని మనం గుర్తించలేకపోము. శివకవిగా ప్రసిద్ధికాంచిన పాల్కురికి సోమన ఒకానొక వైశిష్ట్యంగల వివిధగద్యలను రచించాడు. నిజానికిని వచనరచనలే అయినా ఒక ప్రత్యేకతగల గద్యలుగా పేర్కొనబడడమేగాక సాహిత్యవేత్తలచేత పరిగణింపబడ్డాయి కూడా. ప్లవనామ సంవత్సరం ఉగాదినాడు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రవారు యేర్పాటుచేసిన "నాకు నచ్చిన వచనశైలి" అన్న విద్వద్గోష్ఠిలో గద్య, వచనాల విభిన్నత్వాన్ని, విశిష్టత్వాన్ని గురించి నేను విపులంగా ప్రసంగించాను. ఎంతటి పదబంధశయ్యాభరితమైన గద్యమైనా "బసవాంకగద్య" "శివాంక గద్య" "సాంబాంకగద్య" వంటి నామాలతో వ్యవహరించినట్లే "బశవాంకవచనం" "శివాంకవచనం" "సాంబాంకవచనం" వంటి వచనశబ్దప్రయోగాలతో కూడా గద్యలను వచనాలుగా పేర్కొనవచ్చును. అయినప్పటికీ జటిలపదసంభరితమై కూడా సమాసభూయిష్టమైన వచనాన్ని వచన మనడంకంటే గద్య మనడమే ప్రసిద్ధంగా వున్నది. ప్రత్యేకించి ఆశ్వాసాంతంలో ఉపయోగించే వచనాన్ని అది నిజానికి వచనమే అయినా దాన్ని యెవ్వరూ కూడా ఆశ్వాసాంతవచనంగా వ్యవహరించలేదు సరికదా, ఆశ్వాసాంతగద్యంగా మాత్రమే అతిప్రాచీనకాలంనుంచి వ్యవహరించడం జరుగుతూ వచ్చింది. నారదీయపురాణంలో నరసింహకవి సైతం చిన్న పెద్ద వచనాలను పెక్కింటిని రచించాడు. కాని సనకాదులు యితరదేవతలు శ్రీమన్నారాయణుని నుతించిన సందర్భంలో నరసింహకవి గద్యము పేరుతో విశిష్టసమాసభూయిష్టమైన గద్యాన్ని రచించాడు. (నార. 381. 382. పు. 259. గద్యము). నారదీయపురాణం మొత్తంలో వున్న యితరవచనాలకూ, యీ గద్యానికీ రచనావిధానంలో హస్తిమశకాంతరం మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి గద్య, వచన శబ్దాలు పర్యాయపదాలే అయినా రచనాపరంగా కొన్ని కొన్ని సందర్భాలలో గద్యం