పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజవిరాజితం, భాషిణి, మత్తకోకిల, మయూరవృత్తం, మాలిని, తరళవృత్తం వంటి వాటిని దండక, రగడలతోపాటు విశిష్టగద్యరచనసైతం విరచించాడు.

దివ్యవిమానస్థుడైన శ్రీహరి అర్చామూర్తిని మహేశుడు స్తుతించేసందర్భంలో తెలుగు యతిప్రాసనియమాలను పాటించి సంస్కృతభాషలో మత్తేభవృత్తాన్ని రచించాడు. (నార. 108. పు. 70. ప.) ఇదేవిధంగా అంతకుముందు బ్రహ్మ శ్రీమన్నారాయణుని స్తుతించిన సందర్భంలో కేవల తెలుగుఛందస్సు లనిపించుకుంటున్న రెండుతేటగీతులను, తెలుగులక్షణం ప్రకారం అక్షరమైత్రి గల యతులను ప్రయోగిస్తూ సంస్కృత భాషలో రెండుపద్యాలు రచించాడు. (నార. 103. పు. 47, 48. ప.)

నారదీయపురాణంలో రెండుసందర్భాలలో ఆటవెలదులు గీతపద్యాలుగా "గీ" అని పేర్కొనబడడంద్వారా ముద్రితమయ్యాయి. (నార. 241. పు. 255. ప; 262. పు. 345. ప.) ఆటవెలదిని గీతంగా పేర్కొనడం పొరపాటని కొందరు భావించవచ్చును. నారదీయపురాణం వ్రాతప్రతిలో చాలావరకు ఆటవెలదులు గీతులుగానే పేర్కొనబడ్డాయి. వాస్తవానికి ఆటవెలదిని సైతం గీతమనడం దోషం కానేరదు. మన ప్రాచీనలాక్షణికులు గీతులు సమగీతులు, విషమగీతులని రెండు విధాలని, విషమగీతుల్లో యెత్తుగీతి, పవడగీతి, మేళనగీతులువంటివి చేరగా, సమగీతులలో ఆటవెలది, తేటగీతి చేరినట్లు పేర్కొన్నారు. అందువల్ల ఆటవెలదిని తేటగీతిగా పేర్కొనరాదు కాని గీతంగా పేర్కొనడంలో పొరపాటు లేదు. ఈ గ్రంథపరిష్కర్తలలో ఒకరు మూలంలో ఆటవెలదులను గీతంగా పేర్కొనడంవల్ల ఆపద్యాలన్నీ తేటగీతి లక్షణానికి విభిన్నంగా వున్నాయని భావించి నరసింహకవి సహజంగా రచించిన ఆటవెలదులను, తమభాష నుపయోగించి పరిష్కరణలో తేటగీతులుగా మార్చివేయడంజరిగింది. నరసింహకవి సహజంగా ఆటవెలదులను రచించి వాటిని గీతాలుగా పేర్కొనవచ్చునన్న అభిప్రాయంతో సలక్షణంగా పేర్కొన్నాడన్న విషయాన్ని గుర్తించకపోవడంవల్ల గీతి భేదాలలో ఆటవెలది వొకటన్నసంగతి గమనించనందువల్ల పొరపాటుగా నరసింహకవి పద్యాలను కొన్నింటిని సవరించి వేయడం జరిగింది. అయితే పరిష్కృతమైన నారదీయపురాణాన్ని మూలప్రతితో సరిపోల్చిచూచి నేను పునఃపరిష్కరణ కావించిన సందర్భంలో నరసింహకవి సహజరచనలైన ఆటవెలదులను యథాతథంగానే వుంచడంజరిగింది. నరసింహకవి కల్యాణతీర్థమహిమ - సుచరితుని కథను వర్ణిస్తూ మొదట సీసపద్యం వ్రాసి, సీసంలో తేటగీతిని విశిష్టంగా పంచపాదిగా రచించాడు. (నార. 112. పు. 94. ప.)