పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


'కారణాయ నమో రక్షకాయతే న
మో నమో వరదే నమో మునిజనైక
కుశలదాయ పరేశ వైకుంఠవాసి
నే నమః శ్రీనివాసాయ నిఖిలశరణ.'

(నార. 103. పు. 48. ప.)

ఈ పద్యంలో "కారణాయ నమో-రక్షకాయతే నమో" అన్నప్పుడు అవ్యయాలైన "నమో" లను, మిగిలినచోట్ల నమశ్శబ్దాలను ప్రయోగించినట్లు స్పష్టపడుతున్నది.

ప్రాచీనకాలంలో కొందరు కవులు అనుకరణవిరహితంగా సంస్కృతవాక్యాలను ప్రయోగించిన సందర్భాలు లేకపోలేదు. ఇదేవిధంగా నరసింహకవికూడా "కదళీనకదాచన యని యనిరి"అని అనుకరణసహితంగా ప్రయోగించవలసివుండగా ఈ క్రింది పద్యంలో అనుకరణవిరహితంగానే సంస్కృతవాక్యాన్ని ప్రయోగించాడు.

"చకచక నేమించినయా
ముకురానన యూరుయుగము మోహనకాంతుల్
ప్రకటించి మెఱయఁ "గదళీ
నకదాచన" యనిరి బుధజనంబులు భళిరే!"

(నార. 49. పు. 267. ప.)

తెలుగులో "అయి-అవులకు ఐ,ఔ"లు రావడం సుప్రసిద్ధమైన విషయం. వ్యావహారికంగానూ, గ్రాంథికభాషాపరంగానూ యీ అయి, ఐ, అవు, ఔ ల మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్రాచీనకాలంలో పండితకవులు సైతం తికమకలుపడి తారుమారులుచేసి 'ఐ, ఔ' లకు 'అయి, అవు'లను-ప్రత్యేకించి యీ మార్పురావడానికి వీలు లేకుండా వుండే సంస్కృతంలో సహజంగా ఐకార, ఔకార యుక్తాలైన పదాలలోని ఐ, ఔ లను కూడా అయి, అవులుగా మార్చి తప్పటడుగులు వేసి ప్రయోగించారని 20 సంవత్సరాల క్రిందట నేను రచించి ప్రకటించిన ప్రాచీనవాఙ్మయంలో వ్యావహారికభాష, లేక "ధ్వని-లిపి-పరిణామం" అన్న పరిశోధనాగ్రంథంలో నిరూపించివున్నాను. నైవేద్యశబ్దం సంస్కృతంలో ఐ కార యుక్తమైన నకారంకలది. ఇది వ్యావహారిక వశాత్తూ, ఐ-అయి గా మారి నైవేద్యశబ్దం నయివేద్యంగా మారిపోయింది. నరసింహకవినాటికే యీమార్పు వచ్చిందని "భక్తిమై సహస్రభార స్రమిత నయివేద్య మిచ్చి" (నార. 156. పు. 44. ప.) అన్న ప్రయోగం ద్వారా రూఢి అవుతున్నది.