పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొట్టమొదట 'హరికథ'నే అంటే విష్ణువుకథనే మొట్టమొదటిరచనలో వర్ణించడంవల్ల దానికి 'హరికథ' అని పేరు వచ్చివుంటుంది. క్రమక్రమంగా 'హరికథ' అన్న పేరు ఆప్రత్యేకసాహిత్యప్రక్రియకు రూఢనామంగా రూపొంది గిరికథ వర్ణింపబడినా, సిరికథ వర్ణింపబడినా మరే మహేశ్వర, రామాయణ, భారతాదికథలు, వివిధ ఉపాఖ్యానాలేకాక చివర కాసాహిత్య ప్రక్రియలో సాంఘికచరిత్ర కల కథ చేరినా ప్రస్తుతకాలంలో 'హరికథ'గానే రూఢమైపోయి విపులంగా చలామణి అవుతున్నది. అయితే నరసింహకవి యీ ఆధునికసాహిత్యప్రక్రియావైశిష్ట్యం కల హరికథను దృష్టిలో పెట్టుకొని ఉండడనడం అక్షరాలా సత్యమేకాని 'విష్ణుకథ' అనే అర్థంలో "హరికథ" అని వొకసారి "హరికథాసుధా" అని వేరొకసారి రెండుసందర్భాలలో 'హరికథ' శబ్దాన్ని ప్రయోగించాడు. "ఈశానిష్కృత గురుసత్కృప చేసైన యేవివక్షచేత నీప్రకారమున హరికథ మాకు రుచించునయ్యా వివక్షకొఱకు మఱియు మఱియు నమస్కారంబులు." (నార. 424. పు. 134. పు.) - "సూతుండు శౌనకాదులకు హరికథాసుధాప్రవాహంబు వెల్లివిరియ నిట్లనియె ననిన వారలు నిజశాస్త్రధౌరంధర్యప్రాగల్భ్యంబున వచ్చి నిలిచినయప్పుడు" (నార. 445. పు. 2. వ.).

మందరగిరి భూలోకంలో లేదనీ ఖగోళంలో యెక్కడో ఉత్తరదిగ్భాగంలో దూరతీరాలలో వున్నదనీ నారదీయపురాణం ఆధారంగానే వేదవిజ్ఞానపరంగా గతంలో గుర్తించాము. సంస్కృతంలో లౌకికవాఙ్మయం దృష్ట్యా గిరివాచకాలైన పర్యాయపదాలలో, భూధరం, ధరణీధరంవంటి శబ్దాలుకూడా చేరాయి. భూలోకంలో లేనటువంటి పర్వతాలను భూధరంవంటి పదాలలో వ్యవహరించడం శుద్ధపొరపాటు. మందరగిరి భూమిమీద లేదని తెలిసిన నరసింహకవే 'భూధర' శబ్దాన్ని సర్వసామాన్యపర్వతవాచకంగా భావించి "మందరభూధరోత్తమము" అని మందర పర్వతవర్ణనాసందర్భంగా ప్రయోగించి పప్పులో కాలు వేశాడు. "దాని మందరభూధరోత్తమముఁ గాంచి" (నార. 224. పు. 172. ప.) కొండలు భూమండలంమీదనే ఉండాలని లేదు. యేగోళంమీదనైనా ఉండవచ్చును. భూమికి భిన్నమైనగోళాలలో ఉన్న పర్వతాలను భూధరాలని అనడానికి వీలులేదు.

అనుకరణంలో నమశ్శబ్దం విసర్గకు ఓత్వంవచ్చి 'నమో' అని రూపొందడం వ్యాకరణసమ్మతమై ప్రాచీనకవిప్రయోగప్రసిద్ధమై వున్నది. ప్రాచీనకవులే కొందరు అనుకరణవిరహితత్వంలో సైతం నమోశబ్దాన్ని ఓకారాంతంగానే ప్రయోగించారు. సంస్కృతంలో నమశ్శబ్దమేకాక 'నమో' అనే ఓదంత అవ్యయంకూడా ఒకటి వున్నది. ఈవిషయం ప్రౌఢవ్యాకరణకర్త కూడా తెలియచేశాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని నుతించిన సందర్భంగా నరసింహకవి రచించిన యీ క్రిందిపద్యంలో 'నమో' అనే అవ్యయాన్నికూడా ప్రయోగించినట్లు స్పష్టపడుతున్నది.