పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చల్లనివెన్నెలలు అతపకిరణాలవలే బాధించినట్లు వర్ణించడం కావ్యాల్లో తరచుగా చూస్తూ వుంటాం. చకోరాలు వెన్నెలను భక్షించి జీవిస్తాయనే విషయంకూడా సాహిత్య ప్రపంచంలో ప్రసిద్ధమైన విషయం. అయితే ఆ చకోరాలుసైతం మామూలు వెన్నెలను తట్టుకొని భక్షించి జీవించుతాయి తప్ప సాంద్రమైన చంద్రకిరణాలను చకోరాలు ఓర్చుకోలేవని, ఆ ధట్టమైన వెన్నెలలు, అతపాలవంటివై చకోరాలకు విజ్వరత్వాన్ని కలిగిస్తాయని నరసింహకవి శృంగారవిరహవర్ణనాసందర్భంలో కాదు, ఈశ్వరసాక్షాత్కార నిరంతరానందవర్ణనాసందర్భంలో పేర్కొన్నాడు. "నిల్చిన సేవించి యుపాసీనులై పరబ్రహ్మానందసింధువులగు బయాదికుల వెంట నిక్షురసవీచికా సంగతి నిక్షురసాంభోధినింబోలె నీశ్వరసాక్షాత్కారంబు గలిగి నిరంతరానందంబు వహించియున్నప్పు డొకయనిర్వాచ్యానందంబుగాంచి సాంద్రచంద్రాతపాతంత్రచకోరంబులుంబోలె విజ్వరత్వంబు నొంది యీశవిగ్రహదివ్యస్తదృష్టులై యనిమిషత్వంబు వహించి రప్పుడు" (నార. 379. పు. 252. ప).

చిత్రానక్షత్రయుక్తమైన పౌర్ణిమిగల మాసం చైత్రమాసంగాను ఇదేవిధంగా ఆయానక్షత్రాలతో కూడిన పౌర్ణమిగల మాసాలకు, ఆయానక్షత్రసంబంధనామాలే మాసనామాలుగా యేర్పడ్డాయి. ఈ రూపంగా శ్రవణానక్షత్రయుక్తమైన పౌర్ణమిగల మాసాన్ని శ్రావణమాసమని అనడం వేదఖగోళశాస్త్రబద్ధమైన విషయం. శ్రావణమాస ద్వాదశి అని శ్రావణద్వాదశి అని అనడానికి మారుగా శ్రవణద్వాదశియని నరసింహకవి ఒకమత్తేభంలో విశిష్టంగా ప్రయోగించాడు. "శ్రవణద్వాదశినాఁటిపుణ్య మిడి రాజా! నన్ను రక్షించు" (నార. 232. పు. 210. ప.). ప్రాచీనవాఙ్మయంప్రకారం 'ఛాందస' శబ్దానికి వేదపండితుడు, ఛందశ్శాస్త్రవేత్తవంటి అర్థాలు మాత్రమే వున్నాయి. ఇటీవలికాలంలో ఛాందసుడనే మాటకు పిచ్చిపిచ్చి నమ్మకాలున్నవాడని, మూఢవిశ్వాసలూ, ఆచారాలూ కలవాడని అర్థంవచ్చింది. ఈ విధంగా ఛాందసశబ్దార్థం పరిణామం చెందడం నరసింహకవి నాటికే జరిగిందని నారదీయపురాణంలోని యీక్రిందిప్రయోగంవల్ల తెల్లమవుతున్నది. "వేదాంతమతముకంటె నన్యమగు మతము మంచిదిగాదని తెలియక యీ వేదాంతమతము నాదరించక యీప్రకారమునను స్వగోష్టినిష్టులైన ఛాందసులైనవారి మనస్సులను నల్పులైనవారల నతికల్పనులైన మోహంబు నొందించి రప్పుడు (నార. 376. పు. 244. వ.)

ఆధునికయుగంలో పద్య, గేయ, వచనాత్మకంగా ఒకానొకవైశిష్ట్యం కలిగిన సాహిత్యప్రక్రియ హరికథ పేరుతో అవతరించింది. హరికథావాఙ్మయంలో