పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తరిగలుగ భిన్నకుంభాం
తరమున నది దాఁట నాత్మఁ దలఁచుటగాదే!"

(నార. 178.పు. 152. ప.)

జనవ్యవహారంలో 'నివురు గప్పిన నిప్పు' అన్నది 'ధూళిధూసరితమైన రత్నం' వంటిదన్నట్లుగా తరచు ప్రయోగించబడుతూ వుంటుంది. నివురు అంటే బూడిద అనే అర్థం. నిప్పుకణం తెల్లని బూడిదతో కప్పబడినప్పుడు అది నిప్పు లేని మామూలు వట్టి ఆరిపోయిన బొగ్గు అనుకొని దాన్ని అంటుకున్నా, తొక్కినా ఛుర్రుమని కాలి తీరుతుంది. నిత్యవ్యవహారంలోనూ, సాహిత్యప్రపంచంలోనూ నివురు గప్పిన నిప్పు అని యీ సందర్భంలో 'నివురు' శబ్దాన్ని ఉపయోగించడమే ప్రసిద్ధమై వున్నది. బూడిద పర్యాయపదాలలో 'నివురు' తోపాటు 'నీరు' పదంకూడా వున్నది. 'నీరు' అంటే జలమని మాత్రమే అర్థంకాదు 'బూడిద' అనికూడా అర్థం వున్నది. జలార్థకమైన నీరుశబ్దం సాధురేఫయుక్తమని బూడిద అర్థం కలిగిన 'నీఱు' శబ్దం శకటరేఫయుక్తమని మామూలు సాంప్రదాయసిద్ధంగా పండితులంటారు. అయితే సాధు, శకటరేఫల భిన్నవ్యవస్థ అతిప్రాచీనకాలంలోనే ప్రథ్రష్టమైనది. కలగాపులగమైనది. 'నివురుగప్పిన నిప్పు' అనడానికి మారుగా 'నీరు గప్పిన నిప్పు' అని విశిష్టంగా నరసింహకవి వైకుంఠలోక ఆవరణపంచకవర్ణనాసందర్భంలో "నీరు గప్పిన నిప్పులై నిష్ప్రథత్వపూర్తి పరధామ లోకోపభోగభోగ్యులయ్యు" (నార. 361. పు. 179. ప.) అని ప్రయోగించాడు.

ఎవరైనా మనకు యిష్టంలేనిపనిగాని, వ్యతిరేకమైన పనిగాని చేసినప్పుడు "ఫో, ఫో, మంచిది -వెళ్లు, వెళ్లు, బాగాచేశావ్, బాగాచేశావ్" వంటి పదాలను వికటంగా, అసహ్యంగా వెటకారంతో ఉపయోగిస్తాం. ప్రహ్లాదుడు మహావిష్ణుభక్తు డయ్యాడని తెలుసుకొన్న తరువాత లోకవ్యవహారాని కనుగుణంగానే హిరణ్యకశిపుడు గురువును చూచి "తద్గురుని వక్రంబుగాఁ జూచి పొమ్ము పొమ్ము లెస్స లెస్స! యీ శిశువునిట్లనే చేసితివి" (నార. 464. పు. 88. ప.) అని అన్నట్లు నరసింహకవి జాతీయప్రయోగం చేశాడు. కొడుకును 'బాబూ' అనికాని 'నాయనా' అనికాని 'నాన్నా' అనికాని చివరికి 'బిడ్డా' అనికాని ప్రేమతో పిలవడం లోకంలో వ్యవహారంగా వున్నది. నరసింహకవి కాలంలో కొడుకును ముద్దుగా 'అన్నా' అని పిలిచే అలవాటుకూడా వున్నదికాబోలు. సునీతి తన కుమారునితో మాట్లాడుతూ "అన్న! దుఃఖ మేల యాసురుచి యథార్థమైన యట్ల పల్కె" (నార. 447. పు. 18. ప.) అని కొడుకును "అన్న!" అని సంబోధించినట్లు ప్రయోగించాడు. శృంగారవర్ణనలలో ప్రత్యేకించి విరహవేదనలలో చందమామ