పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్షణంబును నకార్యకరణంబును గోసహస్రవధతుల్యం బని యెఱింగించె. ఏకాదశి నర్హంబె భుజింప? ఏకాదశిని బురోడాశంబును భుజింపంగాదు" (నార. 274. పు. 49. వ.) అని పేర్కొని శంఖంతో జలం త్రాగడం పాపకర్మగా వక్కాణించాడు.

ఆర్షవిజ్ఞానంప్రకారం దైవారాధనలో యేస్థాయిలోనూ హింసకు స్థానం లేదు. కన్నులు పొడుచుకొనడం, ముక్కు, చెవులు, నాలుక కోసుకోవడం, కుత్తుక నుత్తరించుకొనడం యిటువంటివి స్వయంగా చేసుకొనడమే కాదు, చేయడం కూడా వేదవిజ్ఞానందృష్ట్యా, ధ్యానదృక్పథప్రత్యక్షప్రమాణపరమైనవే కాని, ఆచరణపూర్వకమైనవి కావు. కాని వేదవిజ్ఞానం అంతర్ముఖంనుంచి సకలకాలస్వార్థశక్తులకారణంగా బహిర్ముఖమైపోయిన తరువాత హింసాప్రక్రియ లవతరించాయి. నారదీయపురాణంలో మోహినిమాటప్రకారం ధర్మాంగదుడు తన్ను చంపవలసిందని తండ్రిని కోరిన సందర్భంగా "సర్వమేధమఖంబున స్వసుతుఁ బశువుఁ జేసి వ్రేల్చిన తండ్రికి సిద్దమై లభించు నుత్కృష్టపదము గాంభీర్యధైర్యశౌర్యశాలివి నీ కింక శంక యేల?" (నార. 305. పు. 176. ప.) అని సర్వమేధమఖంలో స్వపుత్రుణ్ని పశువుగా వ్రేల్చడం గురించి ఉత్కృష్టకార్యంగా పేర్కొనబడింది. కాగా ఆర్షవిజ్ఞానం వక్రముఖం దాల్చిన తరువాతనే యిటువంటి హింసాప్రక్రియలు అవతరించాయని భావించవలసి వున్నది.

దేవత లనేకమంది వున్నారు. కాని నారదీయపురాణంవల్ల ధర్మదేవత, అధర్మదేవతలేకాక ధర్మాభిమానదేవత, అధర్మాభిమానదేవత, కాలాభిమానదేవత, వేదాభిమానదేవత. విద్యాభిమానదేవత వంటి విశిష్టదేవతలగురించి విపులంగా వర్ణించడం జరిగింది. (చూడు. నార. 399, 400, 407, 408 పు.)

ఆంతరంగికంగా వాస్తవాన్ని పరిశీలిస్తే అస్తి, నాస్తి మతాలకు భిన్నత్వం లేదు. లఘుదీర్ఘాదికాలపరిమితులతో సృష్టి అంతా అశాశ్వతమే. ఈదృష్ట్యా విభిన్నదేవతలకుసైతం కాలపరిమితి వున్నది. అంతత్వం వున్నది. జగన్మిథ్య బ్రహ్మ సత్యమన్న సిద్ధాంతంతో జగత్తంతా వున్నదనీ దానికి శాశ్వతత్వం లేదనీ ఆమోదించడం జరుగుతున్నది. జగతతీతమైనశక్తి యేదీ లేదన్న దృష్టితో నాస్తికత్వం ప్రబలినా, సృష్టివ్యవస్థ గురించిన అశాశ్వతత్వాన్ని గురించి నాస్తికులు సైతం 'ఔనని' ఆమోదించక తప్పదు. వాస్తవానికి జగత్తు అస్తి, నాస్తి వాదుల ఉభయులదృష్టిలోనూ వున్నది. దీని అశాశ్వతత్వం కూడా ఉభయవాదులూ ఆమోదించే విషయమే. అయితే ఒకశక్తిని మించిన వేరొకశక్తి వున్నదా? లేదా? అంటే ఆస్తికు లున్నదంటారు. నాస్తికులుసైతం దైవీయంపేరుతో