పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చర్మచక్షువులతో సైతం సూర్యాది మహాగ్నిగోళాలను బహుముఖంగా పరిశోధించి అఖండఖగోళవేధ చేసిన మహర్షి దీర్ఘతమునికి మామతేయు డనికూడా నామాంతరమున్నది. దీర్ఘతముడు సూర్యాద్యగ్నిగోళాలను అనవరతం పరిశోధనలు చేసి, నేత్రాలు పోగొట్టుకున్నాడు. అంధుడై పోయాడు. అమృతసిద్ధి పొందకుండా, చర్మచక్షువులతో సూర్యాద్వగ్నిగోళాలపరిశోధనకు దొరకొన్న ఫలితమిది. మహాభారతకథనం ప్రకారం దీర్ఘతముడు గ్రుడ్డివాడైన తరువాత భార్యాబిడ్డలను పోషించలేకపోయాడు. "భార్యను భరించి పోషించవలసిన బాధ్యత భర్తమీద వున్నది. నీవు నన్నూ, కుమారులనూ పోషించడంలేదు. సరికదా యేవిధమైన సంపాదనా లేకుండా నీవు మామీద ఆధారపడి బ్రతుకుతున్నావు. పైగా మమ్మల్ని సాధిస్తున్నావు. వేధిస్తున్నావు" అని దీర్ఘతముని భార్య ప్రద్వేషిణి ఆగ్రహించి మాట్లాడుతుంది. అప్పుడు దీర్ఘతముడు విపరీతంగా ఆగ్రహోదగ్రు డవుతాడు. అప్పుడు ప్రద్వేషిణి మరింతగా కినిసి "కుటుంబపోషణ చేయలేని గ్రుడ్డివాడై అసమర్థుడైన మీతండ్రిని ఒకతట్టలో కూర్చోపెట్టి, తీసుకొనివెళ్లి నదిలో వదిలిపెట్టవలసిం" దని పుత్రులకు చెపుతుంది. తల్లి ఆజ్ఞమేరకు దీర్ఘతమునిపుత్రులు ఆపనికి పూనుకుంటారు. అప్పుడు దీర్ఘతముడు తీవ్రమైన కోపంతో "పతి హీనలైన స్త్రీలకు సంఘంలో గౌరవస్థానం వుండదనీ, శుభకార్యాలలో పాల్గొనే అవకాశంలేకుండా పోవుగాక" అనీ శపిస్తాడు. ఈ దీర్ఘతముని శాపం తరువాతనే విధవలైన స్త్రీలకు సంఘంలో గౌరవస్థానం లేకుండాపోయి, శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లేకుండాపోయినట్లు కనిపిస్తున్నది. మనసంఘంలో విధవలపట్ల యేర్పడిన యీదుర్వ్యవస్థ దీర్ఘతముని శాపానికి పూర్వకాలంలో అప్పటి వేదర్షులకాలంలో వున్నట్లు కనిపించదు.

ఒక మంచిపని చేసినా, యేదైనా ఉత్తమవస్తువును తయారుచేసినా, గ్రంథరచన చేసినా, వివిధకళానైపుణ్యాలను చూపించినా సమర్థులై సమర్హులైన పెద్దల ఆమోదముద్రపడితే అది సార్థక మవుతుంది. ఇదేవిధంగా దైవార్చనలో ఉపయోగించే తీర్థాన్ని శంఖంలో పోస్తేనేతప్ప అది పవిత్రతీర్థం కాదని ప్రాచీనకాలంనుంచీ వొక అభిప్రాయం వున్నది. ఏ సందర్భంలోనైనా సరే పెద్దల ఆమోదముద్ర కావలసినప్పుడు "శంఖంలో పోస్తేనేకాని తీర్థం కాదుకదా!" అన్న సామెత చిరకాలంగా జనుల నానుడిలో నానుతున్నది. నారదీయపురాణంలో యిందుకు భిన్నంగా శంఖంలో పోసిన నీరు త్రాగడం పాపకర్మగా పేర్కొనడం జరిగింది. ప్రబోధనీమహిమగురించి మోహినికి రుక్మాంగదుడు వివరించిన సందర్భంలో "శంఖంబుతో జలంబు ద్రావుట, కూర్మసూకరమాంసంబులు భక్షించుట పాపంబులని తెలియంబడియె నేకాదశిభోజనంబును నగమ్యాగమనంబును, నభక్ష్య