పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామూలుగా తండ్రి ఆస్తి సంతానానికి దక్కడం సర్వసామాన్యమైన విషయం. తల్లిదండ్రుల ఆస్తులమీద వారిపిల్లలకు హక్కుంటుందనడం కూడా సామాన్యమైన విషయమే. కొన్నిసందర్భాలలో తండ్రి ధనహీనుడై పుత్రుడు స్వార్జితమైన ధనంతో మిక్కిలి ధనవంతుడు కావచ్చును. తండ్రి పుత్రునిమీద ఆధారపడి పోషింపబడవచ్చును. కాని తండ్రిదగ్గర "ఈ ధనం నాది. నేను సముపార్జించినది." అని పుత్రుడు సగర్వంగా మాట్లాడితే ఆభావం కలిగివుంటే ఆపుత్రుడు నరకంలోకి పోతాడని నారదీయపురాణం చెపుతున్నది. ధర్మాంగదుడు అనేకమందిని జయించి రత్నరాసులనూ, వివిధసంపదలనూ కొల్లగొట్టుకొనివచ్చి తండ్రిపాదాలవద్ద సమర్పించి వీటి ననుభవించవలసిందని ప్రార్థించిన సందర్భంలో "పుత్రార్జితవిత్తంబు గ్రాహ్యంబు శంక వలవదు. వ్యయంబు సేయుము. తండ్రియెడ నీధనంబు నే నార్జించితినని గర్వంబున నాడికొను పుత్రుం డాభూతసంప్లవంబుగా నరకం బనుభవించు. కుఠారంబునుంబలెఁ బిత్రధీనుండగు కుమారుం డిచ్చెనని తండ్రియు ననుకొనందగదు." (నార. 256. పు. 319. వ.) అని నరసింహకవి ఉటంకించాడు.

వైదికబ్రాహ్మణకుటుంబాలలో మాత్రం విధవలు, అకేశలుగా వుండడం చాలాకాలంనుంచి ఆచారంలో వున్నది. నియోగులలో లేదు. ఈ సంప్రదాయం యెప్పటినుంచి యేర్పడిందో చెప్పడానికి మనసంస్కృతీ, చరిత్రను పట్టి చూస్తే సరైన ఆధారాలేవీ కనిపించడంలేదు. అయితే కొందరు సంప్రదాయజ్ఞులు పూర్వం దశరథుడు చనిపోయినప్పుడు కౌసల్యా సుమిత్రా కైకేయీలు శిరోముండనం చేయించుకున్నారని ఆ సంప్రదాయాన్ని మే మనుసరిస్తున్నామని చెప్పడంకద్దు. కాని యిందుకు ప్రామాణికంగా వాల్మీకి రామాయణంలో యెటువంటి శ్లోకమూ లేదు. కనీసం ప్రక్షిప్త మనదగినటువంటి శ్లోకమైనా లేదు. పైగా క్షత్రియులలో అస లీసాంప్రదాయమే లేదు. అయితే నరసింహకవి ధర్మాంగదుని వివాహానంతరం అతనిపరిపాలనావ్యవస్థను వర్ణిస్తూ "ఎచ్చట గూఢవిభవులై లోకులు వర్తింతు, రెచ్చట భర్తృమతియైనయింతి కంచుకరహితయై యిల్లు వెడలి తిరుగు నెచ్చట సకేశయై విశ్వస్త గనఁబడు, నెచ్చట నకేశ యగుచుఁ బుణ్యపురంధ్రి రాణించు." (నార. 258, 259. పు. 332. వ.) అని విధవలు సకేశలుగానూ, పుణ్యపురంధ్రులు అంటే పుంస్త్రీలు, సభర్తృకలైన స్త్రీలు అకేశలుగానూ ఉండరాదని పేర్కొన్నాడు.

1960 వ సంవత్సరంలో ఒక సందర్భంలో నే నుటంకించినట్లుగా - వాస్తవానికి వేదర్షులకాలంలో మృతభర్తృకలైన విధవలు శుభకార్యాలలో పాల్గొనరాదన్న నియమం ఉన్నట్లు కానరాదు. వేదర్షులలో దీర్ఘతముడు గొప్పవాడు. కేవలం ఆర్షదృక్కుతోనేకాక అమేయశక్తివంతాలైన తన