పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుక్మాంగదునిచరిత్ర నిరూపిస్తున్నది. అయితే బహుభార్యాత్వవిషయంలో ప్రథమభార్య వుండగా, రెండవవివాహం చేసుకునేట్లయితే రెండవభార్య కిచ్చే ధనంకంటే (కన్యాశుల్క మన్నమాట) రెట్టింపుధనం ప్రథమభార్యకు యివ్వాలట. తృతీయవివాహం చేసుకుంటే ఆతృతీయభార్య కిచ్చే ధనంకంటే రెట్టింపుధనాన్ని ద్వితీయభార్యకు, ద్వితీయభార్య కిచ్చినధనంకంటే రెట్టింపుధనాన్ని తిరిగి ప్రథమభార్యకూ యిదేవిధంగా యెన్నెన్ని వివాహాలు చేసుకొన్నా క్రమానుగతంగా రెట్టింపుకు రెట్టింపుగా అంతకుపూర్వపుభార్యలకు ధనం యివ్వవలసిన నియమ మున్నట్లు నారదీయపురాణంలోని రుక్మాంగదచరిత్రవల్ల తెలుస్తున్నది. ఈవిధంగా ర్తెట్టింపుధనాన్ని పూర్వపుభార్యల కివ్వకుండానే పునర్వివాహాలు చేసుకుంటే భర్త పూర్వపుభార్యలకు ఋణగ్రస్థు డవుతాడని కూడా యీ సందర్భంలో నరసింహకవి యీ క్రిందివిధంగా స్పష్టపరిచాడు.

"వాసి కెక్కి ద్వితీయవివాహమునకుఁ
గూడి ప్రథమపరిణయద్విగుణధనంబు
లోలి సేయంగఁ దగుఁ గాక యున్న జ్యేష్ఠ
భార్య కాభర్త ఋణికుఁడై పరఁగియుండు."

(నార. 251. పు. 303. ప.)

వాస్తవానికి శాస్త్రీయంగా చూస్తే సంభోగసమయాలు, దినాలు పరిమితంగా వుంటాయి. సంభోగం చేయవలసిన శుభదినాల గురించి, అశుభదినాలగురించి అనేకసందర్భాలలో శాస్త్రాలలో విధినిషేధాలు యేర్పరచడం జరిగింది. సామాన్యంగా దివామైథునం అన్నది ప్రాచీనకామాదిశాస్త్రాలప్రకారమేకాక, ఆధునికవిజ్ఞానందృష్ట్యా కూడా ఆరోగ్యకరమైనది కాదు సరికదా ఆయుక్షీణకరమైనది కూడా. ఉత్తమసంతానం సంజనితం కావాలంటే మంచిమంచి శుభముహూర్తాలను సంభోగసమయాలుగా ప్రాచీనజ్యోతిశ్శాస్త్రవేత్తలు కొన్నిటిని పేర్కొన్నారు. కాని నరసింహకవి యిందుకు భిన్నంగా శాస్త్రీయమైన దృక్పథం లేకుండా చెప్పాడో, అతిశయోక్తిగా వర్ణించాడో, మూలా న్ననుసరించి చెప్పాడో లేదో మనం యేమీ చెప్పలేంకాని రుక్మాంగదుడు మోహినితో సుఖించిన విషయాన్ని వర్ణించినసందర్భంలో "ఇది దిన మిది రే యిది క్షణ మిది జా మిది పక్ష మనుచు నెఱుఁగక భోగాస్పదమగు పదమన నావిభుఁ డెదమాడి సంభోగబోగ మెసఁగ రమించెన్. (నార. 254. పు. 312. ప.) అని సర్వవేళలా శుభాశుభాలతో నిమిత్తంలేకుండా, రాత్రింబవళ్లతో పనిలేకుండా రుక్మాంగదుడు సుఖించినట్లు వర్ణించాడు.