పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదన్నా, ఉన్నదని వైజ్ఞానికంగా సత్యసమ్మతంగా ఆమోదించక తప్పదు. ఈదృష్ట్యానే నరసింహకవి విష్ణువుగురించి వర్ణిస్తూ "అవ్యయుండును, నిరాధారుండును, నిష్ప్రపంచుండును, నిరంజనుండును, విష్ణుండును, శూన్యుండును, వేదస్వరూపుండును, ధ్యేయుండును, ధ్యేయవర్జితుండును" అని పేర్కొనడమేకాక "అస్తి నాస్తి వాక్యవర్తియు, ధూరవర్తియు నంతికవర్తియు" (నార. 310. పు. 197. వ.) అని కూడా పేర్కొని అస్తి, నాస్తికత్వాల మూలతత్వం ఒకటే పొమ్మన్నాడు.

వ్యుత్పత్తి లోకవేద భేదాలతో ద్వివిధమై వుంటుందని నరసింహకవి వివరిస్తూ అలౌకికులుగా జన్మించిన బాలకులు, జననం మొదలు లోకానుభూతితో లౌకికులుగా మారిపోతారని చక్కగ తెలియచేశాడు. "ఆ మూకబాలకులు జన్మంబు మొదలుకొని నయనములు దెఱచి ప్రతిదివసంబునందును దృశ్యములు చూచుచు నున్నవారలై కార్యంబునందు స్వపరవైషమ్యంబు దెలిసి తలిదండ్రులం జూచి దైవవశంబునం బ్రథమవాసన గలవారలై యంతఁ దాత యనియు నంబి యనియుఁ దన్నామంబులం బల్కుదురు. సత్సంజ్ఞాసంజ్ఞాసంబంధ జ్ఞానజిజ్ఞాసు లైన స్వకీయులచేత 'మీ తండ్రి యేఁడీ' యనియు 'మీ తల్లి యేది' యనియు నడుగంబడిన నా బాలకు లా తండ్రినిం దల్లినిఁ దర్జనిచేత నిరూపించి తాతాంబేత్యాది శబ్దములకు నా వాక్యంబునందుఁ గార్యాన్వితతగదా? వారికిం బ్రథమశబ్ద మగుటంజేసి మున్ను గార్యపదాన్వయములేదు." (నార. 405. పు. 51. వ.) నిజానికి మాయ అంటే యేమో తెలియకుండా కుల, మత, జాతి వర్గాది భేదాలు లేకుండా ఈర్ష్యాద్వేషాల కతీతంగా కేవల సచ్చిదానందస్వరూపులుగా కనిపించే పసికందులు మాతాపిత్రాదులు కారణంగా, లోకంకారణంగా పచ్చిలౌకికులుగా మారిపోతారు.

భూమి బల్లపరుపుగా వుందని మన ప్రాచీనులు భావించినట్లు ఆధునికహేతువాదనామకులు కొందరు విమర్శిస్తూ వుంటారు. కాని ప్రాచీనులెవ్వరూ భూమి బల్లపరుపుగా వున్నదని యెక్కడా చెప్పలేదు. పైగా "ధరణీచక్రము దిర్దిరం దిరిగె" ఇత్యాదిప్రయోగాలతో అనేకమంది ప్రాచీనకవులు భూమిని చక్రాకారంలో వున్నట్లు పేర్కొన్నారు. నారదీయపురాణంలో ప్రహ్లాదచరిత్రలో మహావిష్ణువు తన ద్వారపాలకులు భూలోకంలో జన్మిస్తారని చెప్పే సందర్భంలో "మద్ద్వారపాలురు మత్పూర్వసంకల్పవైభవమాయానాటకంబున నధోలోకచక్రంబు బ్రవేశించి యీ శాపంబున నట్ల యవతరించి తరించెదరు" (నార. 422. పు. 123. వ) అని భూలోకాన్ని అధోలోకచక్రంగా సార్థకంగా ప్రయోగించడం