పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరమైనదో చెప్పలేము. వేదా లెప్పటివో విగ్రహారాధన అప్పటిదేనని ఆమోదించవలసివుంటుంది. విష్ణువుకు సనకాదులు విన్నపం చేసుకున్న్న సందర్భంలో "నీకు నుపనిషద్వేద్యంబైన హేమదివ్యమంగళవిగ్రహం బుపాత్త్యర్థంబుగా నారోపింతురు." (నార. 383. పు. 261. వ.) అని విష్ణుమూర్తి హేమదివ్యమంగళవిగ్రహరూపంలో ఆరాధ్యదైవమని ఉపనిషత్తులు పేర్కొన్నట్లు నరసింహకవి వక్కాణించాడు. అసలు శ్రీమహావిష్ణువు బ్రహ్మను సృష్టించిన తరువాత బ్రహ్మకు ఒకటికి రెండుసార్లు స్వయంగా తనవిగ్రహాన్ని అర్చామూర్తిగా శ్రీ మహావిష్ణువే అనుగ్రహించి యిచ్చినట్లు వర్ణించడం జరిగింది.

"ఏల విషాదము నొందెదు
బాలక! యిది యిమ్ము పరమభాగవత సభా
మౌళిమణికి నీ కిత్తు ద
యాళుత నొకదివ్య విగ్రహము గొను మింకన్.

అనుచుఁ గమలాగళాభరణాంకశాలి
యైన నిజకరమున నిచ్చె నాత్మదివ్య
విగ్రహముఁ బద్మజునకు నావిగ్రహంబు
చక్కఁదనమునకై యాత్మఁ జొక్కె సలుప."

1

(నార. 106. పు. 67, 68. ప.)

కాగా విగ్రహారాధన యెంత ప్రాచీనతరమో యెవ్వరూ చెప్పలేరు. శిల్పశాస్త్రంప్రకారం చూచినా విష్ణ్వాదిమూర్తులకు రూపకల్పన మొట్టమొదట యెప్పుడు జరిగిందో సాధికారికంగా యెవ్వరూ చెప్పలేరు. వాస్తవానికి శిల్పాలను చెక్కేప్రతివారూ చాలాకాలంగా శిల్పులుగా పరిగణింపబడుతున్నారు. కాని వారంతా శిల్పులుగా పరిగణనకురారు. తపశ్శక్తితో, దివ్యదృష్టితో విష్ణ్వాదిమూర్తులను చూచి తాము చూచిన రూపానికి చిత్రరూపంలోనో, భాషాయుక్తమైన రచనావర్ణనారూపంలోనో, ఆయామూర్తులకు మొట్టమొదట ప్రతిరూపకల్పన చేసినవారే శిల్పులు. అయితే దివ్యచక్షువుతో అసలుమూర్తిని కాంచకుండా యెవ్వరో మహర్షులు చిత్రరూపంలోనో శ్లోకరూపంలోనో మూర్తిలక్షణం నిర్వచించినదానినిబట్టి, అంటే ఒకశిల్పాన్ని చూచి, మరొకశిల్పరచన చేసినవారు అసలైనశిల్పులు కారు. అటువంటివారిని ప్రాచీనశిల్పశాస్త్రాలలో శిల్పులుగా పేర్కొనలేదు సరికదా "కారుకులు"గా పేర్కొన్నారు. అయితే యిటీవలికాలంలో శిల్పాలు నిర్మించి, శిల్పు లనిపించుకుంటున్నవారంతా అసలైన శిల్పులు కాకుండా కారుకులే నన్నమాట.