పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాషలోసైతం సమర్హమైన, సంపూర్ణమైన పదజాలం లేదనే చెప్పవచ్చును. విష్ణువాక్యాలుగానే నరసింహకవి వర్ణించిన విష్ణుశక్తిని కొంతలో కొంతైనా ప్రతిబింబించగల యీ క్రిందిపద్యం చూడండి.

"విశ్వసృష్టిస్థితిలయాది వివిధకర్మ
ములకు స్వాతంత్ర్యమగు నెట్ల మొదల శేషి
నైనా నా కిట్ల శేషవృత్త్యంతరముల
నాత్మలకునైన స్వాతంత్ర్య మమరియుండు.

(నార. 411. పు. 78. ప.)

ఈ అనంత విశ్వసృష్టిస్థితిలయాలలో శ్రీమహావిష్ణువు తానొక మాయానాటకసూత్రధారినని తనకై తాను నరసింహకవి కవితారూపంలో యీ క్రిందివిధంగా వెల్లడించాడు.

"ప్రకటంబగు మాయానా
టకసూత్రము నడప నతిదృఢస్థితి గల నే
నొకసూత్రధారుఁడను హృ
ద్వికలత యిఁక నేల విడువుఁడు మీరల్.

(నార. 420. పు. 117. ప.)

ఇటువంటి మాయానాటకసూత్రధారియైన మహావిష్ణుమహిమను యెంత కొనియాడినా తనివితీరదు. ఎంతగా యెన్నెన్నివిధాలుగా యెన్నెన్నిరూపాలలో అర్చించినా యెన్నిజీవితాలైనా చాలవు. ఎన్నెన్నిజన్మలైనా చాలవు. అయితే విష్ణ్వర్చనలో 21 సంఖ్యకు ఒకానొకవిధమైన వైశిష్ట్యం, ప్రత్యేకత వున్నట్లు కనిపిస్తున్నది.

విష్ణ్వర్చనలో 21 సంఖ్యావైశిష్ట్యం

నారదుఁడు విష్ణుభక్తిప్రాశస్త్యం గురించి, మునులకు వివరిస్తూ "విష్ణుభక్తాంఘ్రిరేణువులచే నణువేని పర్వతంబగు తదవమానంబునం బర్వతంబేని యణు వగుం గావునఁ గొన్ని దినంబులు దత్పలాశతీరంబుననుండి తీర్థాంతరంబుల నిరువదియొక్కదినంబు నిలిచి పాపంబులం బాసి కల్యాణతీరంబున కేఁగి తపోవిద్యాశీలపయోవిశేషంబులం బెద్దయగు రోమశమహామునిం గాంచి పాదంబులం బడి" (నార. 170. పు. 117. వ.) అని వివిధతీర్థాలలో 21 రోజులు నిలిచి పాపక్షాళనం చేసుకొన్నట్లు వక్కాణించాడు.