పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణంలో మాత్రం, హిరణ్యకశిపునకు అంతరంగికంగా విష్ణుభక్తి వున్నట్లు విష్ణుభక్తి లేనివానివలె అతడు పైకి, అతని జీవితకాలం మొత్తంలో విష్ణువిద్వేషిగా నటించినట్లు అనేకసందర్భాలలో స్పష్టంగా పేర్కొనబడింది "ఇట్లు వివిధభోగంబు లనుభవించుచు, భోక్త హరి యని లోనందలంపుచు స్వేశశేషత్వదృష్టిజనితప్రీతిం జనింపంబడుచు, బాహ్యుండునుంబోలె బాహ్యంబున మాయానాటకసూత్రంబున గడపుచుఁ జార్వాకుండునుంబోలె దేహాత్మాభేదసూచకక్రియలు గావింపుచుఁ గైశికవృత్తి కామినులంగూర్చి కబ్బంబు లొనర్చుచు, 'కాముకేషు సుఖాలాభ' యనుచు నొకానొకచోటం బల్కుచు జగంబు శూన్యశేషంబని మాధ్యమికుండునుబోలె నుచ్చరింపుచు, బహిర్దేశంబున, సేష్టవస్తువులు చూడని యట్లుండి హృదయంబున భావించు యోగియునుం బోలె సర్వంబు నంతరంగంబుననే చూచుచు, బాహ్యంబున లేదని యాడుచు" .............. "బాహ్యంబున దైత్యుఁ డంతరంగంబునఁ బరమ వైష్ణవుండై వర్తించు నమ్మాయావివలన." (నార. 432, 433. పు. 176. వ.) అని వొకటికి రెండుసార్లు హిరణ్యకశిపుని అంతరంగికవిష్ణుభక్తి గురించి స్పష్టంగా ఉటంకించడం జరిగింది. అనంతరం తన పుత్రుడైన ప్రహ్లాదుని మహత్తరవిష్ణుభక్తి గురించి హిరణ్యకశిపు డాంతరంగికంగా యెంతో సంతోషపడినట్లు యీ క్రింది పద్యంలో నరసింహకవి మరింత విస్పష్టంగా పేర్కొన్నాడు.

సంపూర్ణకళాలక్ష్మీ
సంపన్నుండైన సుతు నిశాచరపతి వీ
క్షింపుచు నానందము నను
కంపయు నుప్పొంగఁ బలికెఁ గడు మన్ననతోన్.

(నార. 464. పు. 89. ప.)

అంతేకాదు నరసింహకవి హిరణ్యకశిపుడు హరిభక్తి విడిచిపెట్టవలసిందని ప్రహ్లాదుణ్నిమందలించిన సందర్భంలో ప్రహ్లాదుడు తండ్రితో మాట్లాడుతూ, అసలు హిరణ్యకశిపుడు విష్ణ్వంశలోనే సంజనితుడైనట్లు ప్రహ్లాదునినోటివెంటనే చెప్పించాడు.

"దైత్యేంద్ర! యిన్నియుఁ దగుఁ ద్రిజగజ్జయ
        సంపదనీకు; నో స్వామి; నేఁడు
ప్రాకృతుండవు నీవు పరమాత్మయైన యా
       హరి నిజాంశంబున నవతరించి
యిట్ల యుండకయున్న నీశౌర్య మీశక్తి
      యీమహైశ్వర్యంబు నేలకలుగు;"

(నార. 461. పు. 76. ప.)