పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విష్ణువు సనకాదులకు మోక్షప్రాప్తివిధానంగురించి వివరించిన సందర్భంలో విష్ణువే రాక్షసులు బాహ్యంగా కుదృష్టి, ఆంతరంగికంగా విష్ణుభక్తి కలిగివుంటారన్నభావంతో "దీవించి బాహ్య కుదృష్టి సమ్మతమైన మతమునఁ బ్రియతమస్థితి వహించి." (నార. 417. పు. 100. వ.). "అవైష్ణవులంబోలె నాయందు ద్వేషంబు గావింపుచుఁ గపటంబునం దిరుగుచు, జితత్రిలోకాధిపతులై జగత్రయంబున ఖ్యాతినొందుచుఁ దామసులు తన వారన తామసోపాస్యచరణులై వారలకుం బ్రత్యయంబుగా బ్రహ్మరుద్రాద్యుపాస్తి గావించి వారలవలన బహువరంబులు గావించి యత్యాద్యైశ్వర్యపరాక్రమపయోనిధులై విరోధులుంబలె నటించి మత్పదాంభోజంబు లందెదరు. బాహ్యంబున నసురతాఖ్యాతికై సురల బాధించెదరు." (నార. 417. పు. 101. వ.) అని పేర్కొనడమేకాక యీ మాయానాటకసూత్రంలో విష్ణుప్రయోజనాయత్తులై, జయవిజయులు రాక్షసులుగా జన్మిస్తారని విష్ణువే చెపుతాడు.

ప్రహ్లాదుడు పూర్వజన్మలో ధర్మవత్సలుడనే పేరుతో వేదవేదాంగవేత్తయై ఒకానొకపండితసభలో యశోనిధియైన ధర్మబంధు వనే మునీశ్వరుణ్ని వాదప్రతివాదాలలో గెలువగా, అత డాగ్రహించి, దైత్యకులముఖ్యుడ వవుతావని మొదట శపిస్తాడు. అతడు తిరిగి ధర్మవివేకోద్దీపితుడై బ్రహ్మవిద్యారూపుడైన ధర్మవత్సలుణ్ని అకారణంగా శపించానని బాధపడి, రాక్షసముఖ్యుడ నైనప్పటికికూడా బ్రహ్మవిద్యావివేకపరిపూర్ణుడవై వర్ధిల్లుతాడని పలుకుతాడు. ఆ ధర్మవత్సలుడే హిరణ్యకశిపునకు కృతయుగంలో ప్రహ్లాదుడై పుడతాడు. జయవిజయులు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా సంజనితు లయ్యారని గతంలోనే పేర్కొనబడింది. త్రేతాయుగంలో ఆ జయవిజయులే రావణకుంభకర్ణులై పుడితే, ధర్మవత్సలుడు విభీషణుడుగాను ద్వాపరయుగంలో శిశుపాల, దంతవక్త్రులై పుడితే, ధర్మవత్సలుడు సహదేవుడై తత్త్వబోధనిరూపణం చేస్తాడని విష్ణువే పలుకుతాడు. ఈకృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో తాను నరసింహ, రామ, కృష్ణ, కల్కినామాలతో అవతరించి దుష్టసంహారం చేస్తానంటాడు. కల్కి అవతారం సంభవించి, దుష్టులను సంహరించేది కలియుగ చతుర్థపాదంలోనే, నరసింహావతారానికి పూర్వం విష్ణువే వరహావతార మెత్తి హిరణ్యాక్షుణ్ని సంహరించిన విషయం విస్పష్టం. హిరణ్యకశిపుడు త్రేతాయుగంలో రావణాసురుడుగాను, ద్వాపరయుగంలో శిశుపాలుడుగాను, జన్మించి రామకృష్ణావతారాలచేత సంహరింపబడతాడు. అతనికి పునర్జన్మ తిరిగిలేదు. అంతే కాదు. "కృష్ణాశ్రయంబైన క్రోధంబును, కృష్ణాశ్రయంబైన కామంబును దైత్యులకు గోపికలకు మోక్షహేతువు" (నార. 509. పు. 273 వ.) అనికూడా విస్పష్టంగా వక్కాణించడం జరిగింది. మామూలుగా భాగవతాదిగ్రంథాలలో హిరణ్యకశిపుడు,