పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్త ఏషయాల అవగాహనతో విస్తృతమౌతుంది. ఈ పరిణామంలో పిల్లలకు ఎటువంటి బెరుకూ భయాందోళనలూ కలుగవు. ఈ క్రమాన్ని తల్లకిందులు చేసి తరగతిగదిలో అమ్మనుడికి బదులు పర నుడులను వాడితే పిల్లల మానసిక ప్రవర్తనలో అనూహ్యమైన మార్చులు చోటుచేసుకుంటాయి. తరగతిగదిలో భాష పరాయిది అయితే, పిల్లల మనస్సులో బెరుకూ, భయం, ఆందోళనా మొదలై, వారు చదువులో వెనకబడిపోవటమూ, చివరికి బడిమానేసెయ్యడదమూ జరుగుతుంది. అందుకనే ప్రపంచమంతటా జరిగిన పరిశోధనలలో పిల్లల చదువులకు ఇంటి భాషే బడి భాష కావాలనే విషయం తేటతెల్లమైంది.

అమ్మభాషే బడి భాషగా కూడా ఉండాలనడానికి ఇప్పుడు చెప్పుకున్న విషయాలే కాకుండా ఇంకా ఎన్నో సామాజిక ఆర్ధిక విషయాలూ సాంస్కృతిక అవసరాలూ ఉన్నై. భాషకు జాతి, మతం, కులం, ప్రాంతాల తేడాలు లేవు. అమ్మభాష పుట్టుకతోనే వస్తుంది. పర నుడులను ప్రత్యేకంగా నేర్చుకోవాలి. అది వ్యయప్రయాసలతో కూడినది. ఆ చిన్న వయసులో వారి శక్తియుక్తులూ డబ్బూ సమయమంతా పర భాష నేర్చుకోవడంతో సరిపెట్టగూడదు. ఒకే సమాజంలో కొందరి బడి భాష అమ్మనుడిగానూ మరికొందరి బడి భాష పరాయి భాష కావడంతో చిన్న వయసులో భేద భావాలు ఏర్పడతాయి. సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించాలనుకున్న నాయకులూ మేధావులూ ఎవ్వరూ బడి భాషగా పరాయి భాషలను ఆమోదించరు. అవి ప్రభుత్వ బడులైనా, ప్రైవేటు, కార్బోరేటు స్మూళ్తైనా అన్నింటా అమ్మనుడే బడిభాషగా ఉండాలనేది. పైన చెప్పిన జీవభౌతిక సామాజిక కారణాల వలననే. అమ్మభాషే బడి భాష కావాలనేందుకు ఆర్థిక కోణం కూడా ఉంది. ఏ సమాజంలోనైనా, స్థూల జాతీయోత్పత్తి సాధన ఎలా సాగుతుందో పరిశీలించండి. వ్యవసాయం చేసే రైతులూ రైతుకూలీలు, పల్లెల్లోనూ పట్టణాలలోనూ ఉండి సాంప్రదాయక వృత్తుల ద్వారా వస్తూత్పత్తి చేస్తూ జీవనం సాగించేవారూ, పట్టణాలలోనూ బస్తీలలోనూ ఉంటూ గనుల తవ్వకం, కట్టడాల నిర్మాణం, రవాణా సౌకర్యాల కల్పనా నిర్వహణా, వస్తూత్పాదనా బాగుసేతల పరిశ్రమలలో పాల్టొనేవారూ, విద్యా వైద్య, వ్యాపార పాలనా రంగాలలాంటి సేవల వినియోగంలో పాల్గొనే సమస్త శ్రామికశక్తీ సమాచార వినియోగానికి వాడే భాషలలో ఎక్కువగా స్థానిక భాషలే ఉంటాయి. కొన్ని సంస్థలలో కొన్ని సందర్భాలలో మాత్రమే పరభాషలను వాడవలసిన అవసరం ఉండొచ్చు. వీరందరూ సృష్టించే సంపద భారత సాలుసరి ఆర్ధిక గణాంకాల ప్రకారం చూసినా ఏడాదికి 85 శాతం స్థానిక భాషల ద్వారానే జరుగుతోందని తెలుస్తోంది. ఈ గణాంకాలు మన దేశ భాషల ఆర్థిక పరిపుష్టికి నిదర్శనం. ఈ విషయమే ఇంకొంచెం విడమరిచి చెప్పితే మన మాతృభాషలు అమ్మనుడులు మాత్రమే కాదు; మన సమాజాల ఆర్ధిక సామర్థ్యానికి ఆధారాలు కూడా.

ఈ సమాజం సమాచార, వస్తూత్సత్తుల వినిమయం మీద ఆధారపడి నడుస్తోంది. మన సమాజపు ఆర్థిక శక్తి సామర్థ్యాలు పెరగాలంటే, అందరికీ ఉపాధి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావాలంటే సమాచారం ముందుగా ఆ సమాజపు అమ్మ భాషలో ఉండాలి. ఒకే ప్రదేశంలో అనేక భాషా సమూహాలు ఉండవచ్చు. ఐనా ప్రతి భాషా సమూహమూ ఒక భాషా సమాజమే. ఆ సమాజానికి ఆ భాషలోనే వీలైనంతవరకు అవకాశాలు కల్పించాలి. అప్పుడే సమాచారం అందరికీ సులువుగా అందుబాటులోకి వస్తుంది. ఇట్లా అందుబాటులోకి వచ్చిన సమాచారమే ఆ సమాజంలోని పరిశ్రమలలో వస్తూత్పత్తికి ఆధారం బెతుంది. అప్పుడే ఆ సమాజం వస్తూత్పత్తిలోనూ సమాచార వినిమయంలోనూ మరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. స్థానిక పరిశ్రమలు నిలదొక్కుకుంటాయి. సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇదంతా జరగాలంటే మొత్తం సమాజంలో చదువులు అమ్మనుడిలోనే సాగాలి అనేది కుతర్మం కాదుగదా. ఈ విషయంపై ఈ సమాజంలోని పెద్దలూ, మేధావులూ, రాజకీయనేతలూ సావధానంగా ఆలోచించాలి.

- ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు హైదరాబాదు విశ్వవిద్యాలయం 9866128846

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

8