పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

13


"రసపూర్ణమైన భారతసముద్రంబు
వసమె [1]చెప్పఁగ నెంత వారలకైన !
ఐనను, మీరు నన్నడుగుటఁ జేసి
యేసువిన్నంత మీ కెఱుఁగఁజేసెదను. "
అనుచు, నావ్యాసమహామునీశ్వరుని
మనమున నిలిపి, నిర్మలచిత్తుఁడగుచు,
నాకథకుఁడు శౌనకాదిసన్మునుల
కాకథాసూత్ర మిట్లని చెప్పఁదొడఁగె;
" యతులార, వినుఁడు; మహాభారతంబు
శతపర్వరూపియై చాల నొప్పారు.
[2]నొదవ నూఱును నేను నొక్కటియయ్యు'
బదునెనిమిదియయ్యెఁ బర్వంబు; లందు
వరుసతో నాదిపర్వము, సభాపర్వ,
మరుదార నారణ్య, మట విరాటంబు,
జగతినుద్యోగ భీష్మ ద్రోణములును,
మొగిఁగనన్ శల్యాఖ్యమును, సౌప్తికంబు,
జానొప్ప స్త్రీపర్వ శాంతిపర్వంబు,
లానుశాసనికాఖ్య, మశ్వమేధంబు,
పటుమౌసలీక మహాప్రస్థానికములు,
నటు నాశ్రమాప్తి, స్వర్గారోహణంబు,
సరినిది యష్టాదశప్రబంధముల
సరహస్య వేదార్థ సారబంధంబు,
విన్నఁబుణ్యము, దీనివినినయుత్తములఁ
గన్నఁబుణ్యము పుణ్యకతయైనకతన.
 

  1. దాటగ' అని యుండుట మేలు.
  2. 'ఒదవనాఱును నేను నొక్కటియయ్యు' అని మూలము. ఆవాంతరపర్వములతోఁగలిసి 106 అగుట చేఁ బైరీతిగా సవరింపఁ
    బడినది.