పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

533


సహదేవుని దక్షిణదిగ్విజయము

గొని యేఁగె భీముఁ డక్షుద్రశౌర్యమున;
ననఘుఁ డుత్తముఁడు [1] సహాదేవుఁడంత
ధీరత దక్షిణదిక్కునకరిగి
శూరసుమిత్రుని శూరసేనులను
దంతవక్త్రుని సాళ్వధరణీశ్వరులను
సంతత ప్రతిపక్షజగదీశవరుల
శృంగారయుతుల గోశృంగగిరీంద్ర
సంగుల నృపుల నిస్సంగులఁ జేసి,
కుంతిభోజునిచేతఁ గోరి యర్థములు
సంతసమునఁగాంచి, జయమురెట్టించి
జలజాక్షుపగవాని జంభకునొడిచి,
తలకొని వానినందనునిచే సమద
గజ హయరత్నసంఘంబులఁ గొనుచు
విజయుఁడై నర్మద వేడుకఁ జేరి,
యందు నవంతిదేశాధీశ్వరులను
విందానువిందుల వేడుకగెలిచి
పోయి మాహిష్మతీపురమున విడియ,
నాయెడ వడి నీలుఁడనుమహారాజు
దీకొనియెను సహదేవునితోడ.
ఢాక మాద్రేయుఁ డడ్డముచొచ్చి పోర,
నతనిపై నీలుండు ననలంబుఁ బఱప
నతివేగమున వహ్ని యాసహదేవు
సకలసేనలమీఁద సరవితోఁ జుట్టెఁ
బ్రకటితగతి.” నన్నఁ బారీక్షితుండు

  1. ఈపదమును దీర్ఘమధ్యముగాఁబ్రయోగించుట ఇతనికేగాక, ఆదిపర్వకర్తయగు
    తిమ్మయకును బరిపాటియే.