పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

513


నా మగధేశుండు నమ్ముని యాజ్ఞ
నేమంబుతోడను నిజపురంబునకు
నేతెంచి యాఫలం బిలను భాగించి
చాతుర్యమునఁ దనసతులకిద్దఱకుఁ
బెట్టిన, వారు తప్పృథుఫలప్రౌఢి
గట్టిగా నప్పుడు గర్భిణులగుచుఁ
బదిమాసములు మోచి, పసనొక్కరాత్రి
విదితంబుగా వారు వెసఁ గాంచిరంత
నొక్కొక్కకన్నును నొక్కొక్క చెవియు
నొక్కొక్కచెక్కును నొక్కొక్కమూపు
నొక్కొక్కచను బొడ్డు నొక్కొక్కచెయ్యి
యొక్కొక్కచరణంబు నుదయంబుగాఁగఁ;
గాంచి యంతటఁ బుణ్యకామినీమణులు
వంచనతోడ నావ్రయ్యలు చూపఁ
బతికిఁ జెప్పఁగరోసి, [1] పరిఖపంకమునఁ
దతితప్పకుండంగ దాదులచేత
వేయించినను, నంత వెస 'దైత్యభామ
యాయెడఁజూచి వ్రయ్యలు రెండుఁగూర్ప
రెండును నేకమౌ రీతి శోభిల్లఁ
జండశరీరుఁడై జయమునొందుటయు,
నాదైత్యభామిని యావజ్రదేహు
నాదట నెత్తంగ నలవిగాకుండె.
ఆబాలకుండు మహారవంబునను
బ్రాబల్యచిత్తుఁడై పలవరించుచును
ఆకుమారుండేడ్వ, నంతఃపురంబు
రాకేందుముఖులు గారామునఁ బంప

  1. చదుకమందు వైచినట్లు. నన్నయ,భా . తే చతుష్ఫధ నిక్షిప్తే ' అని వ్యా. భా