పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

512

ద్విపద భారతము.


కాశిరాజనువాని గాదిలిసుతలఁ
గాశసన్నిభకీర్తి గౌరవాన్వితలఁ
గవలవారల నతికాంతి[1]సమ్మితల
నవిరళమతిఁ బెండ్లియాడి, సొంపుగను
భోగింపుచును, దుదిఁ బుత్రులు లేమి
నాగమోక్తులయందు నఖిలదానములఁ
బుత్త్రకామేష్టియుఁ బొందుగాఁ జేసి
పుత్త్రులఁగనలేక పొలఁతులుఁ దాను
వనమున కేఁగి, యవ్వల సహకార
ఘనమహీజము క్రిందఁ గైకొని తపము
చేయుచునున్న కౌశికమునిఁ గాంచి
యాయతభక్తితో నర్ఘ్యపాద్యములఁ
బూజింప నమ్మునిపుంగవుండనియె:
“రాజశేఖర, బృహద్రథ, నీకు నెద్ది
యిష్టంబు? వేడుమ యిచ్చెద.' ననిన
దృష్టించి యతనికి ధృతి మ్రొక్కిపలికె :
“నెంతసంపదగల్గ నేమి ఫలంబు!
సంతానములు లేక సన్మునినాథ!
తనయులు గలుగంగ దయసేయు, మనిన
ముని కౌశికుడు యోగమునఁ జింతసేయ
మామిడిపండు గ్రమ్మున నేలఁబడిన,
నాముని దానిని నభి[2]మంత్రితంబు
చేసి బృహద్రథుచేతికినిచ్చి,
భాసురభక్తితోఁ బలికె నెయ్యమున :
“నీఫలంబున నీకు నిట నొక్కకొడుకు
సాఫల్యమున వేగజనియించు.' ననిన

  1. సన్మతుల
  2. మంత్రకంబు (మూ)