పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

505


నరుని మాద్రేయుల నయమార్గములను
గరుణమన్నించినఁ, గమలాక్షుఁజూచి
భయభక్తితో నర్ఘ్యపాద్యాదివిధులఁ
బ్రియమునఁ బూజించి పీఠస్థుఁ జేసి,
కలయ లోకముల యోగక్షేమమెల్లఁ
జెలువుగా నరసి రక్షించు శ్రీకృష్ణు
నేమమంతయును బ్రసిద్ధిగా నడిగి,
యామహాత్మునితోడ నప్పుడిట్లనియె :
"మాకు లోకములకు మరివిధేయుఁడవు;
నీకుఁ గాన్పింపవే నిఖలకార్యములు!
ఐనను నీకు నేనటువిన్నవింతు;
మానుగా నారదమౌని యేతెంచి
పలికెను నాతోడఁ: బాండుభూవిభుఁడు
చలనంబుతో [1]యమసభనున్నవాఁడు;
అతనికిఁ బుణ్యలోకావాస [2]మబ్బ
రతిపతిగురుకృప రాజసూయంబు
సేయునీ.' వనుచును చెప్పిఁతాఁబోయెఁ;
దోయజనేత్ర, యిందుకుఁ గార్యసిద్ధి
గావింపు." మనవుడుఁ గమలలోచనుఁడు
భూవల్లభునకు విస్ఫురణ నిట్లనియెఁ :
“గులశీలముల సర్వగుణవిశేషముల
ననఘచరిత్రుండవైనట్టి నీకు
రాజసూయమహాధ్వరము సేయఁదగును
ఆజుల గెలుచునీయనుజుల బలిమి;
నీకోర్కి సఫలంబు నెఱయఁ గావింతు;
నేకచిత్తంబున నెంతయు నుండు.

  1. రాజ
  2. మంబు (మూ)