పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

467


అని చెప్పి నొగలపై నతివఁగూర్చుండఁ
బనుప, సుభద్రయుఁ బగ్గముల్ వట్టి
జిలిబిలినవ్వును సిగ్గును బెరయఁ,
బలుమాఱు పయ్యెద పచరించుకొనుచుఁ
దేరుదోలుటయు, నద్దేవేంద్రసుతుఁడు
ఘోరనారాచముల్ గురియంగనార్చి,
యమృతభాండమున కయ్యండజాధీశుఁ
డమరులతోఁ బోరునట్టి చందమున
వంచియు వ్రాల్చియు వ్రక్కలించియును,
ద్రుంచియు నొంచియుఁ దూలనేసియును,
జించియుం దెంచియుఁ జిదురుచేసియును,
ముంచియుఁ గూల్చియు మొనవిఱిచియును,
బాణధారానిజప్రౌఢిఁ జూపుటయుఁ,
బ్రాణభీతికి నోడి బలములుచెదరి
కన్నులఁగన్నవంకలఁ బాఱుటయును,
అన్నరుండును వేడ్కనరిగె శీఘ్రమున.
ఆరీతి సైన్యంబు లాయాదవాగ్ర
వీరులతోడ నవ్విధము చెప్పుటయు,
వృష్ణిభోజులు గోపవివశులై రామ
కృష్ణులతో బురికేతెంచునపుడు
రాముఁడు భీకరప్రళయకాలోగ్ర
భీమునికరణిఁ గోపించి యిట్లనియె:
"ఎట్టెట్టురా! పార్థుఁ డేలేనిచోట
నిట్టు నాపురిఁజొర నెవ్వఁడు వాఁడు!
పొట్ట క్రొవ్వినచందములుగాక, కికురు
పెట్టిపోయెడునట్టి బీరముల్గలవె!
ఎటువోవవచ్పు నాయెదుట; నెందున్నఁ
బటుభంగి రథముతోఁబట్టి వేతెత్తు.