పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

466

ద్విపద భారతము


అట పార్థుఁడును భార్య నరద మెక్కించి
పటుతరశస్త్రాస్త్రభరితుఁడై కదలి
పోవుచో, ద్వారకాపురవీథి నెపుడుఁ
గావలియుండు శృంఖలుఁడనువాఁడు
తను వేవురుగ్రయాదవులు సేవింపఁ
జనుదెంచి యాసవ్యసాచి నీక్షించి
దహనుఁడై మండి యాదవసేనతోడఁ
గహకహధ్వని సమగ్రముగ నిట్లనియె:
"ఓరిసేనాధ్యక్ష, యోవిరూపాక్ష,
యోరిసంగరకోప, యోరిసౌవీర,
రండురం; డది! పాండురాజనందనుఁడు
కండక్రొవ్వున రాజకన్య సుభద్రఁ
గొనిపోవుచున్నాఁడు కుటిలమార్గమున
మునుకొని హరియు రాముఁడు లేనిచోట.
వీనిఁ బోనిచ్చిన విభులచే మనకుఁ
గానికార్యము పుట్టుఁ గడఁగుఁ.” డటంచు
జలదకులంబెల్ల సమకాలవృష్టి
గులగిరీంద్రము ముంచుకొన్నచందమున
బాణవేణికల నప్పార్థుఁగప్పుటయు,
బాణవైరిమఱంది భయమింతలేక
చిఱునవ్వు దళుకొత్తఁ జెలువ కిట్లనియె :

అర్జునుఁడు యాదవవీరుల జయించుట


"హరిణాక్షి, చూచితే! యాదవబలము;
కన్నులుగానక గదనంబుసేయఁ
బన్నిన యాయల్పబలమెంత నాకు!
దొరఁకొని రథమీవు దోలుమా నాకు;
శరముల భస్మంబుచేసెద వీరి.”