పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

412

ద్విపద భారతము


బసిమి నేవురఁ దనభక్తిశక్తులకు
బొసఁగిన [1]యుక్తితో, బూజలు చేసి :
"యిదిగదా! నాఫల; మిదినా ప్రతిజ్ఞ;
వెదకిననిధిఁగంటి; విఖ్యాతిఁగంటి;
నాభాగ్యమునఁగాదె! నాఁడగ్నిఁదప్పి
యీభంగి నుండితి రినతేజులార!
కూరిమిఁ బార్థుకుఁ గూతునీగంటిఁ;
గోరిననాగోర్కి కొనసాఁగఁగంటి.
విల్లుపట్టినయట్టి విధము వీక్షించి
యుల్లంబు నరునిఁగా నూహించిచూచి,
యిందువంశాధీశ, యెఱుఁగలేనైతి;
సందేహమిటపాసె సంతోష మెసగె .
వాసవికింక వివాహయత్నంబు
చేసెద లగ్నంబుచింతించి, ” యనినఁ
బాంచాలువీక్షించి పలికె ధర్మజుడు :
"మంచిమార్గము నీదుమాటయిట్టిదియె;
ఇంక నొక్క విచార మించుక గలదు.
పంకజానన నేము పరఁగ నేవురము
వరియించువారము వైదికస్థితిని;
పరికింప మాకుంతిపలుకు నిట్టిదియె.
తల్లివాక్యంబని ధర్మంబుఁదప్ప;
మెల్లఠావులఁ దొల్లి యిట్టివిగలవు;
[2]ఘనజటిలాకన్య గౌతముకూఁతు
మునులేడ్వురును గాదె మున్ను గైకొనిరి!

  1. భక్తితో
  2. ఘనజటాలునికూతు కౌతునికన్య
           మునులేవురునుగారె మున్ను గైకొనిరి
           పూచి దక్షిణియను పూబోణింగాదె
           ప్రాచేతసులు కొంట పదవకొక్కండు. (మూ)
    వ్యాసభారతమునుబట్టి పైవిధముగా మార్చఁబడినది.