పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

ద్విపద భారతము


గప్పి పార్థునివిల్లుఖండించి యార్వ,
నప్పుడుకోపించి యమరేంద్రసుతుఁడు
ధీనుతగతిఁ దన తేరుపై నుండి
వాని తేరికిదాటి వడి వానిఁ దెచ్చి
బిగువుపగ్గంబులఁ బెనఁగొన మిగులు
నొగులఁ బాంచాలు నన్నొగలతోఁగట్టి,
శిథిలతఁ బాంచాలసేనలువాఱ
రథసూతుఁబడఁదన్ని, రథికులుగొలువఁ
గొనితెచ్చి 'గురునకు గురుదక్షిణార్థ'
మని ద్రుపదునిఁ జూప, నాతనిఁజూచి :
'అక్కట, ద్రుపదునకా! యిట్టియునికి!
నక్కచిక్కులు చిక్కినాఁడవి దేమి!
నిరతినన్నెఱుగుదా! నీచెలికాని;
నురురాజగర్వ మేయూరికిఁ జోయె!
అంటివి మమునొవ్వ నాఁడు; తత్ఫలముఁ
గంటి; తొంటివి యింకఁగలవె గర్వములు!
పోపొమ్ము కాచితి బుద్ధితో."ననుచు
జాపశిక్షకుఁడు పాంచాలునివిడిచి,
వినుతిఁగట్టఁగనిచ్చి వీడుకొల్పుటయుఁ,
జని యూరుచొరక యీశ్వరుఁగూర్చి తపము
నతఁడుసేయఁగఁజొచ్చె; నటపాండురాజ
సుతులతో గరిపురిచొచ్చెద్రోణుండు.
మఱునాఁడు కృప భీష్మ మంత్రికుమారు
లెఱుఁగ నర్జునుఁజూచి యిట్లనె గురుఁడు :
"చలమునఁ బాంచాలు జయకథాశీలు
గెలిచిననీకుఁ దక్కినరాజులెంత!
ఇచ్చిననావిద్య, యీడేరె నీకు;
నిచ్చెదె! దక్షిణ యింకనాకొకటి?