పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

ద్విపద భారతము


జెలువారు నమ్మాద్రిఁ జెచ్చెరఁ గదిసి,
వలదని వారింప వలనొప్ప నతఁడు
ఆలింగనము సేయ, నబల వారించి :
"యేలయ్య! మఱతురే యిటు నిన్ను నీవు!
వనము నీయుద్యానవాటిఁ గాదు;
వనము నీదువిలాసవాసంబుకాదు;
మునులలోఁ గొందఱుమునులమై కాదె!
మన మున్నవారము మన మున్నతముగ!
పదరకు; రాకు; పైఁబడకు; పట్టకుము;
కదియకు." మనుచు నంగన పోవఁబోవ,
సలలితపల్లవశయ్యాతలమున
బలిమిమై నదరంటఁ బడఁతుకవెంటఁ
బట్టి, భావజకేళి భరితసామ్రాజ్య
పట్టాభిషిక్తుఁడై పాండుభూవిభుఁడు
ప్రాణంబు విడిచినఁ, బఱతెంచి కుంతి
ప్రాణేశ్వరునిమీఁదఁ బడి మూర్ఛనొంది,
దేవి మద్రకుమారి తెలుపఁగాఁ దెలిసి:
"యోవినిర్మలతేజ, యోపాండురాజ,
యోకురువర, ధీర, యోమహాశూర,
యోకరుణాకర, యోవీరవర్య,
ఎక్కడఁ బోయితే! యేను లేనైతిఁ!
దక్కక తాఁకెనే తపసిశాపంబు!
దిక్కులన్నియుఁ గెల్చి దివిజులు మెచ్చ,
నక్కజంబుగ ధనం బపరిమితంబు
తెచ్చి, యగ్రజుఁడైన ధృతరాష్ట్రవిభున
కిచ్చి యాగంబు సేయించితి వీవు.
నీయంతశూరుండు, నీయంతసుకృతి,
నీయంతకారుణ్యనిధి యెందుఁగలడు!