పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

241


ఎక్కడి మధుమాస! మెక్కడిమాద్రి!
యెక్కడిసంభోగ! మిం దేమి గలదు!
పలుకు లేటికి, మాద్రిపైఁ గన్ను వేసి
మెలఁగుని న్నెఱిగియు మేము మఱచితిమి.
మునిశాపచరమసముద్రంబునందు
మునిగితే కురురాజ! మోహనాకార!
మొగి శాపబడబాగ్ని ముట్టిననీవు
జగదీశ, పోయితే జలధిగంభీర!
సంయమీశ్వరు శాపచటులాగ్నిచేత
నొయ్యనఁ జిక్కితే! యుడురాజవంశ!
[1]వనితేక్షణములను వలలోనఁ దవుల
ననిపెనే! సూనసాయకువేఁటకాఁడు;
అక్కాంతనెఱి[2]కురులను నురులందుఁ
జిక్కితే కౌరవసింహంబ! నేఁడు;
బ్రాహ్మణులకు నేడు పాయసాన్నములు
బ్రహ్మార్పణంబుగా భక్తి నేనొసగ,
నెడచూచి మఱిగదా! యిట్లు చేసితిని ;
పడఁతికై చావంగఁ బాడియే నీకు!
అసమాస్త్రుదివసంబు లంటిఁ గదయ్య!
యసము దింపక యుండుమంటిఁ గదయ్య!
ప్రాణేశ, న న్నీవు పాసిన వెనుక
ప్రాణంబు లేలొకో, పాయవు నన్ను!
తపసులు వెఱఁగందఁ దప మర్థిఁ జేసి,
విపులపుణ్యుల ధర్మవిదుల నందనుల
నమరులవరమున నర్థితోఁ గాంచి,
యమరలోకంబున కరిగితివయ్య!

  1. వనితవీక్షేక్షణవలలోఁ దవుల
  2. గురులనురులచేత (మూ )