పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము

239


లేమ కుంతీదేవి లేనిప్రొద్దునను,
గాముఁ డోర్చినవాఁడు గానిప్రొద్దునను,
మెఱుఁగుఁజన్నులమీఁద మృగనాభి యలఁది,
నెఱిఁ గల్వరేకులనిగ్గు వట్టించి,
మొల్లమైఁగిడిన ముత్యాలమాఱు
మొల్లమొగ్గలు గ్రుచ్చి మొలనూలు గట్టి,
సొంపైన మెయిదీఁగె సొమ్ములమాఱు
సంపంగిరేకులు సంప్రీతిఁ దాల్చి,
తెగగలకస్తూరితిలకంబుమాఱు
మొగలిపుప్పొడి గోటిమొన నెత్తి దిద్ది,
జగియెక్కి మెఱుఁగులు [1]జీరులువాఱు
చిగురాకుచంద్రికచీర ధరించి,
పొన్నలుఁ బొగడలు బొండుమల్లియలుఁ
గ్రొన్ననలును గీలుకొప్పునఁ దురిమి
వనలక్ష్మిగతినున్న, వసుధాధిపతియు
నొనర డగ్గరఁబోయి యొరసుకయుండి,
గురుభక్తితో నంత గొంతి విప్రులకు
సరసాన్నములఁ దృప్తి సలుపుచునుండి
తన్ను నేమఱుట చిత్తములోన నెఱిఁగి,
క్రన్నన నప్పు డేకాంతంబునందు
దండితారాతి యుద్దండవిక్రముఁడు
పాండుభూపాలుండు భావజుకులికి,
సంయమియిచ్చినశాపంబు మఱచి,
సంయతహృదయ [2]విస్రబ్ధత మఱచి,
పొలుపారు వనపుష్పభూషణంబులను
లలిమీఱి భవపుష్పలతికచందమునఁ

  1. జీరుకువాయ
  2. విసంభృత (మూ)