పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

ద్విపదభారతము


ఉన్నతి సంతానమొకటి తప్పించి
యన్నిభోగంబులు ననుభవించితిమి
కలదొకొ పుత్త్రునిఁ గన్నారఁ గానఁ!
గలకంఠి, యట్టేల గలుగుఁ బాండునకు!
పుత్త్రలాభములేనిబొంది నాబొంది,
ధాత్రి నుండిన నేమి! తప్పిన నేమి!
సంతతి గలదని స్వర్గలోకమున
కింతి, పోదముగాక యిందఱియట్ల.
ధృతి 'నపుత్త్రస్య గతిర్నాస్తి' యనెడు
శ్రుతివాక్యమున్నది శూలమై చెవుల.
ఎంతతపంబున నేధర్మములను
నింతి, గల్గఁగ నేర విహపరోన్నతులు.
అది విచారించి, మీయందు నందనుల
ముదమునఁ బడయంగ మొగి నాకురాదు.
మృగశాపభయ మాత్మ మెఱయుచున్నదియు ;
[1]సుగతి నాకిక యెట్లు చొప్పడఁగలదు!
క్షేత్త్రజన్యాయంబు చింతించి, నీవు
పుత్త్రులఁ బడయుము భువి నిందరాదు.
నాయాజ్ఞ సేయుము నాతి, పుణ్యంబు
వేయిచోట్లను నేను వింటి నాక్రమము,
ప్రబలధర్మములకుఁ బ్రబల మీచంద;
మబల, నీ వింక నాయనుమతంబునను
దలఁపఁగ ధర్మసంతతి గాంచితేని,
పొలుపార నాకబ్బుఁ బుణ్యలోకంబు.
లనువార దేవరన్యాయంబునందు
ఘను శ్వేతకేతునికథయును వినవె!

  1. సుదతి (మూ)