పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

209


అని పాదయుగళిపై నబలలు పడినఁ,
దనకరంబుల నెత్తి ధారుణీశ్వరుఁడు :
"మీరు చెప్పినయట్లు మృగనేత్రలార,
కోరి వర్తించెదఁ గొంక నేమిటికి!
పాయక హృదయంబు పదిలమౌ నేని,
మేయాశ్రమంబైన నేమియుఁ గాదు.
మనవెంట వచ్చినమంత్రులనెల్ల
ననిచెద వస్తువాహనములతోడ.
పోయినవారలు భూనాథుతోడ
నాయున్న యునికి విన్నపము చేసెదరు;
పూనెదఁగాక తపోభార." మనుచు
మానినీసహితుఁడై మానవేశ్వరుఁడు
జడలు వల్కములు శాంతిమైఁ దాల్చి,
యడలుచునున్న సైన్యము వీడుకొల్పి,
తమభూషణంబులుఁ దమవస్త్రములును
గ్రమముతో భూసురగణముల కిచ్చి,
తక్కినధనములు తనయన్న కప్పు
డక్కజంబుగఁ బంపి, యతినిశ్చయముగ
నిందుబింబాస్యల నెలమిఁ దోకొనుచుఁ
గందమూలముల నాఁకలి దీర్చుకొనుచు
మునుకొని యుత్తరముఖముగాఁ గదలి,
మునులెల్ల విస్మయంబుగఁ జూచి పొగడ
నయగుణోజ్జ్వలుఁ డంత నాగశైలమును
రయమున నట చైత్రరథమును గడచి,
తొలఁగక చనిచని తుహినాద్రి దాటి,
యలఘుపుణ్యుఁడు గంగ నట యుత్తరించి,
సురసిద్ధసేవ్యమై సొం పగ్గలించి
ధరనొప్పు గంధమాదనమున కరిగి,
గురుమతితో హంసకూటంబు గడచి,