పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

ద్విపదభారతము


పాండురాజు శతశృంగమందుఁ దపమొనర్చుట

యల్లన శతశృంగమను గిరిచేరి,
చల్లని నవపర్ణశాల గావించి,
యందు దేవేంద్రాదు లచ్చెరువంద
నందంద తపము సేయఁగ, నొక్కనాఁడు
పిన్నలయ్యును శాంతిపెరిగినమునులు,
నెన్నియుగంబులో యెఱుఁగని మునులుఁ,
గన్నున హరిఁగాని కాననిమునులు,
హరి వచ్చి 'వర' మన్న నడుగనిమునులు,
హరిరూపు హరురూపు నందినమునులుఁ,
బెంపార మఱియును బెద్దలౌ మునులు,
గుంపులుగుంపులై కోటిసంఖ్యములు
పుణ్యులు, ఘనులు, సభ్యులు, యశోధనులు,
గణ్యులు, విబుధలోకస్తోత్రమతులు,
సత్యసంధులు, మహేశ్వరపదధ్యాన
నిత్యులు, వరతపోనిధులు మోదమునఁ
బోవఁగాఁ, బొడగాంచి భూపాలకుండు
దేవీసహాయుఁడై తెరువునఁ గూడి
వారివెంటనె పోవ, వారు వీక్షించి
భూరాజుగాఁ దలపోసి యిట్లనిరి:
"ఎవ్వరు నీ! వేల యిట్లు మావెంట
దవ్వని తలఁపక తలఁగి వచ్చెదవు?
నెలఁతలు రాలేరు నిలువు మిచ్చోటఁ;
దెలియు మింతటినుండి దేవమార్గములు :
సురమునీంద్రుల మేము; సురలకుఁ గాని
నరులకు మావెంట నడచిరారాదు."