పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

81


గణములు దనకు నొక్కట సహాయముగ,
గణనమీఱినమునిగణములతోడఁ
బరమపుణ్యుఁడు కశ్యపబ్రహ్మ వేడ్క
పురణింప నరుదైనపుత్త్రకామేష్టి
సలుపుచో, నీవు నిర్జరులతోఁ గూడి
యెలమి రాఁ, [1]బాదము లిట్టట్టువడుచు
మానితాంగుష్టప్రమాణదేహములఁ
బూనిక ఫలమూలములు సమిధలును
వరుసతో గొనివచ్చు వాలఖిల్యాది
పరమసంయముల నేర్పడఁజూచి నగినఁ,
గనుఁగొని, రోషించి, ఘనమునీశ్వరులు
చనుదెంచి, నీమీఁదిచలమున నప్పు
డతివీర్యవంతంబులైన మంత్రముల
నతినిష్ఠ ననలున కాహుతుల్ వ్రేల్చి :
'శతమఖుకంటెను శతగుణవీర్య
యుతుఁడు కశ్యపునకు నుదితుఁడై, యాతఁ
డింద్రున కింద్రుఁడై యెసగుత.' మనిన
నింద్ర, నీ వంతయు నెఱిఁగి భీతిల్లి,
వాలఖిల్యులఁ జేరి వరుస బ్రార్థింప,
నాలోనఁ గశ్యపుఁ డమ్మునివరులఁ
గనుగొని: "మీ రిట్లుగా నియమింపఁ
జనునె! యాతఁడు బ్రహ్మసమ్మతి నింద్రు
డయ్యున్న నింక రెండవయింద్రుఁడైనఁ
జయ్యనఁ ద్రైలోక్యజనులకు బాధ
యగుఁ; గాన, వేఱొక్కయనువున నతని
'ఖగముల కింద్రుడౌఁ గా' కనకున్నఁ

  1. దపములు (మూ)