పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

ద్విపద భారతము


గ్రీడ నొండొంటితోఁ గినిసి పోరాడఁ
గూడినసింగంపుఁగొదమలో యనఁగ,
అలమును జలమును నందంద మెఱసి
తలపడుమేరువింధ్యంబులో యనఁగ,
ఎదు రైన సమదృష్టి నిల నోర్వ లేక
కదిసి డీకొన్న దిగ్గజములో యనఁగ.
గాలికి కొండ గ్రక్కదలనియట్లు
గాలిపుట్టువు నిల్వఁగా జెట్టి భీము
ఘోరరూపముఁ గాంచి కొండగాఁ దలఁచి
చేరి కూల్చంగ వచ్చినయింద్రుఁ బోలె.
తలఁప నారీతి నిద్దఱు మేటిమగలుఁ
దలపడి మల్ల యుద్ధము సేయునపుడు
పరువడిఁ గూడుదంపతులచందమునం
గర మర్థి బిగియారం గౌఁగిలింపుదురు,
చెలికాఁడుఁ జెలికాఁడుఁ జేరినయట్లు
పెలుచఁ గేలును గేలుఁ బెనచి యాడుదురు,
మెండుగా మించఁ గ్రమ్మినసిద్ధు లనఁగ
నొండొరుఁ బడ వైవ నుత్సహింపుదురు,
వెలఁదికై జగడించువిటులచందమునఁ
గలయిక వ్రేయ నంగముఁ జూతు రెలమి,