పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


నరపతివేడ్క మిన్నక పోవు టెఱిఁగి
దరహాసవదనుఁ డై ధర్మరా జనియె:
"మనుజేశ పిలిపింపు మన బానసీని
వినుతి మార్కొని వీని విఱుగఁ దోలెడిని.
వలలున కిది యెంత ? వసుధేశ వాఁడు
తలంచిన గెల్చు గంధర్వరాక్షసుల.
పొలుపార ధర్మజుపురములో నెపుడు
బలుమల్లరుల దారఁ బట్టుచు నుండు
వరుస; నే నేఱుఁగుదు వానిసత్త్వంబు ;
ధరణీశ వీనితోఁ దలపెట్టి చూడు.”
అనిన భూపతి భీము సటకు రప్పించి
యనయంబు గర్వాంధుఁ డగుజెట్టి జూపి
యనియె “ సన్నద్ధుఁడ వై వీనితోడ
జెనసి మార్కొను " మన్నఁ జెలఁగి వాయుజుఁడు
కర మర్థిం దనయన్న కనుసన్న యెఱిఁగి
పరితోషమున మత్స్యపతిఁ జూచి పలికె :
"పురణించి ధర్మజుపురములోపలను
సలుపుదుఁ దొల్లి నిచ్చలు జెట్టిపోరు.
నేడు నీయెదుట నా నేర్చినయంత
వాఁడిమి పచరింతు వడిఁ జిత్తగింపు.