పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1

37


ఇతనివంశముఁ బేరు నెట్టిదో ధాత్రిఁ
గృతమతిఁ దెలియువా రెవ్వరిచ్చోట ?
వచ్చు కార్యము చెప్పు వలెఁ గాక యితని
కిచ్చెద రాజ్యంబు నేను గైకొనక.”
అనుచోట విభుఁ జేర నరిగి వాయుజుఁడు
మునుకొని వినయసంపూర్ణు డై మ్రొక్కి,
"కులమున శూద్రుండఁ గువలయాధీశ
సొలయక మును ధర్మసుతు బానసీఁడ
వలలుండు నాపేరు; వసుధ నెవ్వరును
దలఁప నాసరి గారు తగినవంటలకు,
నినుఁ గొల్వ వచ్చితి  ; నీ వింక నాకు
నొనరఁ గూడును జీరయును బెట్టు చాలు.
పురణించి యుబ్బెసపోక నీయెదుట
బెరసి యేనుఁగుతోడఁ బెనఁగు లాడుదును;
కాఱెనుపోతైన ఘనసింహ మైన
మీఱి పట్టఁగ నేర్తు మెదలి పోకుండ,
అంచితశక్తి నే నన్న మల్లులును
పంచబంగాళ మై పాఱిపోవుదురు,
ఏలిన నేలు న న్నేలుకూరులకు
మేలుబంతియ పోలె మేలఁగు చుండెదను."