పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము



భీముడు బానసీడై విరటుఁ గొలువవచ్చుట

వంటలవానికై వడి దోఁప భీముఁ,
డొంటిమైఁ జట్టువం బొకకేలఁ బట్టి
చంక నుగ్రఫు హేతి సవరించి దిండు
వంకిణితోఁ గూడ వడిఁ బట్టి బిగిచి
కోలలు డాకేలఁ కొన్ని సంధించి
లీలఁ జిత్రించినలేఁదోలు దాల్చి,
అతిధీరుఁ డై తనయన్న చెంగటికి
గతిగూడి మత్తేభగమనంబుతోడ
విరటసభ్యుల కెల్ల వ్రేఁక మై తోఁప
వెరవుతో నాస్థానవీధి డగ్గఱెను.
అల్లంతఁ బొడఁగాంచి యతనియుద్ధృతికిఁ
దల్లడం బంది యెం తయుఁ జోద్య మంది
జనులు వారికి పౌరు సంభ్రమింపఁగను
దనలోన నిట్లని తలపోసి నృపుఁడు:
"భీమబాహాశక్తిపేర్మి వీక్షింప
మే మెన్నఁడును జూడ మిట్టిమానవుని.
మానవమాత్రుఁడే మహిలోన నితడు ?
భానుఁడో మఱిచిత్రభానుఁడో కాక !