పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

ద్విపద భారతము


అనవుడు విరటుఁ డయ్యనిలసంభవునిఁ
గనుఁగొని పలికె ను త్కంఠ దీపింప :
"ఎక్కడిమాట నీ వెట్లు శూద్రుఁడవు ?
చిక్కనినీమేనిచెలువంబు చూడఁ
బ్రాకటసామ్రాజ్యపద మౌను గాదె!
నీకు నేటికి నింత నీచవర్తనము ?
వివిధవాహనములు వివిధసంపదలు
సవరించి యిచ్చెదఁ జనవుతో నుండు."
అనుటయు భీముఁ డొయ్యన మోము గలఁగ
మనుజేంద్రుమాట సమ్మతి గాక పలికె:
"ఇవి యొల్ల, నా కిష్ట మైనమార్గమున
గువలయాధిప నన్నుఁ గొలిపించికొనుము.
ఓపవేనియుఁ దెల్పు ముత్తమోత్తమము,
వే పోయి వే ఱొక విభునిఁ గొల్చెదను,
ఏమియో నీచిత్త మెఱిఁగింపు మనిన"
భూమిపాలుఁడు వాయుపుత్రుఁ బ్రార్థించి
"నీకాంతి కను వైననీతిఁ జెప్పితిని ;
కా కున్న మానె నాగ్రహ మేల నీకు ?
వలల నావద్ద నీ వలసినయట్లు
కలకాలమును నుండు కడువేడ్క తోడ.