పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


మనవిం డ్లెఱుంగ రే మహి నెల్లజనులు?
జనులకు నివి యవశ్యముఁ జూప రాదు.
అమరేంద్రతనయుండు ననయంబు వింటి
నిమిషమాత్రముఁ బాసి నిలువంగ లేఁడు.
ఎ ట్లైన నివి దాఁచు టిదియె కార్యంబు.
చోట్లు గుఱుతు గాఁగఁ జూచి రం" డనిన
నేఁ బోదు నని పూని యెలమి నర్జునుఁడు
పూఁబోణి నొకచోటఁ బొలు పొర నునిచి
యలయక వీక్షింప నటు పోయి పోయి
పొలుపు మీఱిన ప్రేతభూమిచెంగటను
గనియె నానాభూతకలితాట్టహాస
ఘనకాకఘూకభీకర మైనదాని ,
మిన్నేఱు శిరమున మేనఁ బాములను
జెన్నారఁ దాల్చుచు శివుఁ బోలుదాని,
గాండీవ మిచ్చినకర్త నాయందు
నుండు నీ విటఁ జూప మునుప రమ్మనుచు
మొగిఁ గ్రీడిఁ బిలుచుచొప్పున గాలిఁ గదలు
చిగురాకుచేతులఁ జెలు వైనదాని,
భావింప నిష్టంబుఁ బాండుపుత్రులకు
గావింప నొకవేళ గలిగె నా కనుచుఁ