పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


బొనర సంతోషించి పులకించె ననఁగ
మనకంటకములచేఁ గర మొప్పుదాని,
విస్తార మగుజమ్మి వీక్షించె నపుడు.
ప్రస్తుతు లొనరించి బా గయ్యె ననుచుఁ
జెప్పంగఁ దొడఁగెఁ దోఁ చినయుపాయంబు
దప్పక చనుదెంచి ధర్మ రాజునకు :
“అల్లదె జమ్మి మీ రవధరించితిరె!
ఎల్లశస్త్రంబుల నిందు దాఁపుదము.
జనులకు రాఁ బ్రయోజనము లే దిందు ;
జననాథ వచ్చియు సాధింప లేరు.
శవము కైవడి దోఁపఁ జర్మంబు పొదివి
భువిమీఁద నేరికిఁ బొడసూప కుండ
శరచాపములఁ గట్టి జమ్మిపై బెట్టి
వెర వొప్ప నెందైన విహరించి మనము
క్రమ్మఱఁ జనుదెంచి కైకొనం దగును.
ఇమ్ముగా నీ వేళ కిది నాకుఁ దోఁచె."
అనవుడు నౌఁ గాక యని ధర్మ సూనుఁ
డనుజులుఁ దాను నొయ్యన జమ్మిఁ జేరి
"వెలయ మీమీవిండ్లు వెస నెక్కు డించి
యల వొప్ప నా చేతి కంది యిం" డనినఁ