పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

337

విరటుండు మేటి భూవిభులలో ననుచుఁ
బరికించి వచ్చె నీ పాండవాగ్రజుఁడు.
వైరివంచితుల మై వచ్చి నీప్రాపు
చేరి యేకొద లేక చెలఁగితి” మనుడు
మది సంతసించి యామానవేశ్వరుఁడు
"ఇది నాతఫఃలం బిది నాదుకోర్కి
వసుధ మీమన్నించువారిలో నొకఁడఁ
బొసఁగ నన్యుఁడు గాఁగఁ బోహణింపకుఁడు;
నాపాలఁ గరుణించి ననుఁ బెద్ద చేసి
మీపూన్కి దీర్చుట మిగులంగ లెస్స.
ఏను ధర్మజునకు నీరాజ్య మిచ్చి
యే నున్నపురి నిచ్చి యిభకోటి నిచ్చి
ధనధాన్యమణు లిచ్చి దళ మెల్ల నిచ్చి
నను వచ్చి సేవించునాథుల నిచ్చి
హితులను మఱి పురోహితుల బాంధవుల
సుతుల మంత్రులఁ గూడి జోకమై నెపుడు
నితఁ డేడుగడయుగా నితని పాదములు
చతురత్వమునఁ గొల్తు సర్వకాలంబు.
గజపురిపై దాడిగాఁ బుచ్చెనేని
భుజశక్తి నచటఁ జూపుదు నోపినంత"