పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-రా

249

ఎసఁగినవేడ్కతో నింక ద్రోణునకు
వెసఁ బ్రదక్షిణము గావింతుము గాని
తేరుఁ దోలుము వీరిదేస నెన్న మనకుఁ
గ్రూరంబు గొఱగాదు గురుమూర్తి గాన.
జలదంబుఁ బిడుగుతో సంధించినట్లు
విలువిద్య నేర్పి నీవిప్రోత్తముండు ;
భావింపఁ దెలియు మశ్వత్థామకన్నఁ
గేవలమును ననుఁ గృప సేయు మదిని.
కావున నితనితో, గయ్యంబు సేయ
భావంబు కొలుపదు పరికింప నాకు.
కురురాజుతోడ మార్కొనఁగఁ దా నిట్టు
లరుదెంచె నితఁ డేసినప్పు డేయుదము.
అతనిపుత్త్రుఁడు తండ్రియంతటివాఁడు
అతులితం బైనశస్త్రాస్త్ర విద్యలను.
పురహరువరమునఁ బుట్టె ద్రోణునకుఁ
బురుహూతుతో నైనఁ బోరాడు నతఁడు.
మఱి కృపాచార్యుండు మాతండ్రిసఖుఁడు
చిఱుత కాలమునాఁడు చెప్పె విల్విద్య.
కృపుఁ డంట గాని నిష్కృపుఁడు వైరులకుఁ
జపలదుర్యోధనుసర్వాంగరక్ష.