పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34


(బి) 'ఏ' అను నతడు ఒక విదేశరాజ్యములో కాన్సలు పదవియందుండి, ఆ రాజ్యము యొక్క మంత్రి నుండి ఒక లక్ష రూపాయలను స్వీకరించును. 'ఏ' ఈ మొత్తమును ప్రత్యేకమైన ఒక అధికారిక కార్యమును చేయుటకు గాని, చేయకుండ మాను కొనుటకుగాని, భారత ప్రభుత్వ మూలముగ ఆ రాజ్యమునకు ఏదేని ప్రత్యేకమైన ఉపకారము చేయుటకు గాని చేయ ప్రయత్నించుటకు గాని ప్రేరణముగ, లేక బహుమానముగ స్వీకరించినట్లు కన్పించదు. కాని 'ఏ' ఈ మొత్తమును, తన ఆధికారిక కృత్యముల నిర్వహణములో సాధారణముగా ఆ రాజ్యమునకు అనుకూలతను చూపుటకు ప్రేరణముగ లేక బహుమానముగ స్వీకరించినట్లు కన్పించును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(సీ) 'ఏ' అను ఒక పబ్లికు సేవకుడు, 'ఏ'కు ప్రభుత్వము పై గల పలుకుబడి వలన 'జడ్'కు ఒక బిరుదు లభించినదని 'జడ్' ను మభ్య పెట్టి ఆ ఉపకారమునకై ధనమును 'ఏ' కు 'జడ్' బహూకరించునట్లు చేయును. 'ఏ' ఈ పరిచ్ఛేగములో నిర్వచింపబడిన అపరాధమును చేసిన వాడగును.

అవినీతికరమైన లేక శాసనవిరుద్ధమైన పద్ధతుల ద్వారా ఒక పబ్లికు సేవకునిపై పలుకుబడి నుపయోగించుటకు పారితోషికమును తీసికొనుట.

162. అవినీతికరమైన లేక శాసనవిరుద్ధమైన పద్ధతుల ద్వారా ఎవరేని పబ్లికు సేనకునిచే ఏవేని ఆధికారిక కార్యమును చేయించుటకు లేక చేయకుండ మాన్పించుటకు గాని, అట్టి పబ్లికు సేవకుడుగా అతని ఆధికారిక కృత్యముల నిర్వహణములో ఏ వ్యక్తి పట్ల నైనను ఏదేని అనుకూలతను లేక ప్రతికూలతను చూపింప జేయుటకు గాని, కేంద్ర ప్రభుత్వము, లేక ఏదేని రాజ్య ప్రభుత్వము, లేక పార్లమెంటు లేక ఏదేని రాజ్య విధానమండలి మూలముగనైనను 21వ పరిచ్ఛేదములో నిర్దేశింపబడినట్టి ఏదేని స్థానిక ప్రాధికారము, కార్పోరేషను లేక ప్రభుత్వ కంపెనీ మూలముగ నైనను, ఎవరేని పబ్లికు సేవకుని మూలముగనై నను ఏ వ్యక్తి కైనను ఏదేని ఉపకారము లేక అపకారము చేయించుటకు లేక చేయింప ప్రయత్నించుటకుగాని, ప్రేరణముగ లేక బహుమానముగ ఏ వ్యక్తి నుండియైనను తన కొరకు గాని ఎవరేని ఇతర వ్యక్తి కొరకు గాని ఏదేని పారితోషికమును స్వీకరించు లేక పొందు, లేక స్వీకరించుటకు అంగీకరించు లేక పొందుటకు ప్రయత్నించు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకునిపై వైయక్తిక మైన పలుకుబడిని వినియోగించుటకు పారితోషికమును తీసికొనుట.

163. వైయక్తి కమైన పలుకుబడిని వినియోగించుట ద్వారా ఎవరేని పబ్లికు సేవకునిచే ఏదేని ఆధికారిక కార్యమును చేయించుటకు లేక చేయకుండ మాన్పించుటకు గాని, అట్టి పబ్లికు సేవకుడుగా అతని ఆధికారిక కృత్యముల నిర్వహణములో ఏ వ్యక్తి పట్ల నైనను ఏదేని అనుకూలతను లేక ప్రతికూలతను చూపింపజేయుటకుగాని, కేంద్ర ప్రభుత్వము లేక ఏదేని రాజ్య ప్రభుత్వము, లేక పార్లమెంటు లేక ఏదేని రాజ్య విధానమండలి మూలముగనైనను, 21వ పరిచ్ఛేదములో నిర్దేశింపబడినట్టి ఏదేని స్థానిక ప్రాధికారము, కార్పొరేషను లేక ప్రభుత్వ కంపెనీ మూలముగ నైనను, ఎవరేని పబ్లికు సేవకుని మూలముగనైనను ఏ వ్యక్తి కైనను ఏదేని ఉపకారము లేక అపకారము చేయించుటకు లేక చేయించ ప్రయత్నించుటకు గాని, ప్రేరణముగ లేక బహుమానముగ ఏ వ్యక్తి నుండి యైనను తన కొరకుగాని ఎవరేని ఇతర వ్యక్తి కొరకు గాని ఏదేని పారితోషికమును స్వీకరించు, లేక పొందు లేక స్వీకరించుటకు అంగీకరించు లేక పొందుటకు ప్రయత్నించు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

న్యాయాధీశుని సమక్షమున ఒక కేసులో వాదించుటకు ఫీజు తీసికొనునట్టి అడ్వకేటు, విజ్ఞప్తి దారు తన సేవలను, క్లెయిములను వివరించి పంపుకొను విజ్ఞాపన పత్రమును సక్రమముగ వ్రాయుటకు, సరిదిద్దుటకు రుసుము తీసికొనునట్టి వ్యక్తి , శిక్ష విధింపబడిన నేరస్థుని కొరకు ఆ శిక్షను విధించుట అన్యాయమని చూపు వైఖరిగల కథనము లను ప్రభుత్వము సమక్షమున ఉంచుటకు రుసుము తీసికొను ఏజెంటు, - వీరు, వైయక్తి కమైన పలుకుబడిని వినియోగించువారును, వినియోగింతుమని చెప్పుకొను వారును కారు, కావున ఈ పరిచ్చేదము క్రిందికి రారు.

పబ్లికు సేవకుడు 162వ లేక 163వ పరిచ్ఛేదములో నిర్వచించిన అపరాధముల దుష్ప్రేరణ చేసినందుకు శిక్ష

164. పై కడపటి రెండు పరిచ్చేదములలో నిర్వచించిన అపరాధములలో ఏదైనను ఎవరి విషయమున చేయబడినదో ఆతడు ఒక పబ్లికు సేవకుడై యుండి, ఆ అపరాధమును దుష్ప్రేరణ చేసిన యెడల, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ఉదాహరణము

'ఏ' ఒక పబ్లికు సేవకుడు. 'ఏ'కు భార్యయైన 'బీ' ఒకానొక వ్యక్తికి ఒక పదవినిమ్మని 'ఏ'ను వేడుటకు ప్రేరణముగ ఒక కానుకను స్వీకరించును. అట్లు చేయుటకు 'ఏ' ఆమెను దుష్ప్రేరణ చేయును. 'బి' ఒక సంవత్సరమునకు మించని కాలావధికి కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.