పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35


'ఏ' మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతోగాని, జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడును.

పబ్లికు సేవకుడు తాను జరుపు చర్య లేక కార్యకలాపముతో ప్రమేయము గల వ్యక్తి నుండి ప్రతిఫలము లేకుండ విలువగల వస్తువును పొందుట.


165. ఒక పబ్లికు సేవకుడుగా ఉండి, అట్టి పబ్లికు సేవకుడుగా తాను జరిపిన, లేక జరుపబోవుచున్న ఏదేని చర్యతో, లేక కార్యకలాపముతో ప్రమేయముగాని, తన యొక్క లేక తాను ఆధీనస్థుడై యున్న ఎవరేని పబ్లికు సేవకుని యొక్క అధికారిక కృత్యములతో ఏదేని సంబంధముగాని కలిగియుండినట్లు , లేక కలిగియున్నట్లు, కలిగియుండబోవునట్లు, తనకు తెలిసియున్నట్టి ఏ వ్యక్తి నుండి యైనను,

లేక ఆట్లు ప్రమేయము కలిగియున్న వ్యక్తి యొక్క హితాభిలాషియై యున్నట్లు లేక అతనితో బంధుత్వము కలిగియున్నట్లు తనకు తెలిసియున్నట్టి ఏ వ్యక్తి నుండి యైనను,

ప్రతిఫలము లేకుండ, లేక తగినంతది కానిదని తనకు తెలిసియున్నట్టి ప్రతిఫలమునకు గాను విలువగల వస్తువును దేనినైనను తన కొరకు గాని, ఎవరేని ఇతర వ్యక్తి కొరకు గాని స్వీకరించు, లేక పొందు, లేక స్వీకరించుటకు అంగీకరించు, లేక పొందుటకు ప్రయత్నించు నతడెవరైనను,

మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ఉదాహరణములు

(ఏ) 'ఏ'అను కలెక్టరు, 'జడ్' యొక్క సెటిల్మెంటు కేసు తన వద్ద జరుగుచుండగా 'జడ్' యొక్క ఇంటిని అద్దెకు తీసికొనును. సద్భావపూర్వకముగ బేరము జరిగియుండినచో ఆ ఇంటికై మాసమునకు రెండు వందల రూపాయలు “ఏ' చెల్లించవలసి యుండగా, 'ఏ' మాసమునకు ఏబది రూపాయలు చెల్లించ వలసినట్లు ఒప్పందము జరిగినది. 'ఏ' తగినంత ప్రతి ఫలము లేకుండ 'జడ్' నుండి విలువగల వస్తువును పొందినాడు.

(బీ) 'జడ్' యొక్క కేసు 'ఏ' అను న్యాయాధీశుని న్యాయస్థానమునందు జరుగుచున్నది. మార్కెటులో హెచ్చు రేటు పై విక్రయింపబడుచున్న ప్రభుత్వ ప్రామిసరీ నోట్లను 'జడ్' వద్ద 'ఏ' తగ్గింపు రేటు పై కొనుగోలు చేయును. 'ఏ' తగినంత ప్రతిఫలము లేకుండ 'జడ్' నుండి విలువగల వస్తువును పొందినాడు.

(సీ) 'జడ్' యొక్క సోదరుడు తప్పుడు సాక్ష్యము నిచ్చినాడను ఆరోపణ పై పట్టు కొనబడి 'ఏ' అను మేజిస్ట్రేటు వద్దకు తీసికొనిపోబడును. మార్కెటులో తగ్గింపు రేటు పై విక్రయింపబడుచున్న ఒక బ్యాంకు షేర్లను 'జడ్' కు హెచ్చు రేట్ల పై 'ఏ' విక్రయించును. 'జడ్' ఆ ప్రకారము ఆ షేర్లకు గాను 'ఏ' కు పైకము చెల్లించును. అట్లు 'ఏ' చే పొందబడిన డబ్బు తగినంత ప్రతిఫలము లేకుండ అతనిచే పొందబడిన విలువగల వస్తువు అగును.

161వ పరిచ్చేదము లేక 165వ పరిచ్ఛేదము నిర్వచించబడిన అపరాధముల దుష్ప్రేరణ చేసినందుకు శిక్ష.

165-ఏ. 161వ పరిచ్చేదము లేక 165వ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగు ఏదేని అపరాధమును దుష్ప్రేరణ చేయువారెవరైనను, ఆ దుష్ప్రేరణ పరిణామముగా ఆ అపరాధము చేయబడినను చేయబడకున్నను, మూడు సంవత్స రములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటింతోగాని శిక్షింప బడుదురు.

ఏ వ్యక్తి కైనను హాని కలిగించు ఉద్దేశముతో పబ్లికు సేనకుడు శాసనమును పాటించకుండుట,


166. పబ్లికు సేవకుడై యుండి, అట్టి పబ్లికు సేవకుడుగా తాను నడచుకొనవలసిన తీరును గూర్చిన ఏదేని శాసనాదేశమును పాటించకుండుటవలన ఏ వ్యక్తి కైనను హాని కలిగించు ఉద్దేశ్యముతో, లేక అట్టి పాటించని వలన ఏ వ్యక్తి కైనను తాను హాని కలిగించగలనని ఎరిగియుండి అట్లు పాటించకుండు నతడెవరైనను, ఒక సంవత్సరము దాకా ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ఉదాహరణము

ఒక న్యాయస్థా నముచే 'జడ్' కు అనుకూలముగ ఈయబడిన ఒక డిక్రీ తీరుదలకై డిక్రీని ఆస్తి పై అమలు పరచుటకు శాసనాదేశము పొందిన అధికారియగు 'ఏ' తనవలన తద్వారా 'జడ్' కు హాని కలుగగలదని తెలిసియుండియు ఆ శాసనాదేశమును పాటించకుండును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.