పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19


అపరాధి ఏ వ్యక్తికైనను మరణమును లేక ఘాతను లేక అక్రమ అవరోధమును కలిగించుచుండునంతవరకు లేక కలిగింప ప్రయత్నించుచుండునంతవరకుగాని, తత్ క్షణ మరణము, తత్ క్షణ ఘాత, తత్ క్షణ వైయుక్తిక అవరోధము కలుగునని భయము కొనసాగుచుండునంతవరకుగాని, దోపిడిని అడ్డుటలో ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు కొనసాగును.

అపరాధి అపరాధిక అక్రమ ప్రవేశమును లేక దుశ్చేష్టను కొనసాగించుచుండునంతవరకు, అపరాధిక అక్రమ ప్రవేశమును, లేక దుశ్చేష్టను అడ్డుటలో ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు కొనసాగును.

ఇంట-కన్నము చేయుటద్వారా ఆరంభమైన ఇంట -అక్రమ ప్రవేశము కొనసాగుచుండునంతవరకు, రాత్రి పూట ఇంటికి కన్నము వేయుటను అడ్డుటలో ఆస్తి విషయమున స్వయం రక్షణ హక్కు కొనసాగును.

ఏ ప్రమేయములేని వ్యక్తికి కీడు కలిగించే ముప్పు ఉన్నప్పుడు, ప్రాణాపాయకరమైన దౌర్జన్యమును అడ్డుటలో స్వయం రక్షణ హక్కు

106. మరణ భీతిని సహేతుకముగా కలిగించునట్టి దౌర్జన్యముని అడుటలో స్వయంరక్షణ హక్కును వినియోగించుట యందు, ఏ ప్రమేయము లేని ఒక వ్యక్తికి కీడు కలిగించు ముప్పు లేకుండ అట్టి హక్కును సార్థకముగా వినియోగించు కొనలేని స్థితిలో ఆ స్వయంరక్షకుడు ఉండునో, అతని స్వయం రక్షణ హక్కు ఆ ముప్పును కలిగించు మేరకు విస్మరించును.

ఉదాహరణము

ఒక మూక 'ఎ' పై బడి అతనిని హత్య చేయుటకు ప్రయత్నించును. అతడు మూకపై కాల్పులు జరుపకుండ స్వయంరక్షణ హక్కును సార్ధకముగా వినియోగించుకొనలేదు, మరియు అతడు ఆ మూకలో కలిసియున్న చిన్నపిల్లలకు కీడు కలిగించు ముప్పు లేకుండ కాల్పులు జరపలేదు. 'ఏ' అటు కాల్పులు జరిపినందున ఆ పిల్లలలో ఎవరికైనను కీడు కలిగినను, అతడు ఎట్టి అపరాధమును చేసిన వాడు కాడు.

అధ్యాయము-5

దుష్పేర్ణణను గురించి

ఒక పనికి దుష్ప్రేరణము.

107. ఒక వ్యక్తి---

మొదటిది : --- ఒక పనిని చేయుటకు ఏ వ్యక్తినైనను పురికొల్పినచో, లేక

రెండవది :-- ఆ పనిని చేయుటకు ఒక ఇతర వ్యక్తితో గాని ఒకరికన్నా ఎక్కుమ మంది ఇతర వ్యక్తులతో గాని కుట్రలో చేరియుండగా, ఆ పనిని చేయుటకుగాను ఆ కుట్రను అనుసరించి ఒక కార్యమును చేయుట అయినను,శాసనానుసారము చేయవలసిన దానిని చేయకుండుట అయినను జరిగినచో, లేక

మూడవది ----- ఏదేని కార్యమును చేయుట లేక శాసనానుసారము చేయవలసిన దానిని చేయకుండుట ద్వారా ఆ పనిని చేయుటకు ఉద్దేశపూర్వకముగ తోడ్పడినచో.——

ఆ వ్యక్తి ఆ పనిని చేయుటకు దుష్ప్రేరణ చేసిన వాడగును.

విశదీకరణము : --- ఒక వ్యక్తి బుద్ధిపూర్వకముగా తప్పుగా తెలుపుట ద్వారానైనను, వెల్లడించుటకు తనకు భాధ్యతగల ఒక ముఖ్యమైన సంగతిని బుద్ధి పూర్వకముగా తెలుపకుండుట ద్వారానైనను, స్వచ్ఛందముగా ఒక పని చేయించిన, లేక చేయబడునట్లు చేసిన, లేక చేయించుటకు గాని చేయబడునట్లు చేయుటకుగాని ప్రయత్నించిన ఆ వ్యక్తి, ఆ పనిని చేయుటకు పురికొల్పినట్లు చెప్పబడును.

ఉదాహరణము

'ఏ' అను ఒక పబ్లికు అధికారి ఒక న్యాయస్థానపు వారంటు ద్వారా, 'జడ్'ను పట్టుకొనుటకు ప్రాధికార మొసగబడినాడు. 'బి' ఆ సంగతిని ఎరిగియుండి, 'సీ' అను నతడు 'జడ్' కాడని కూడ ఎరిగియుండి 'సీ' యే 'జడ్' అని బుద్ధి పూర్వకముగా 'ఏ' కు చెప్పి తద్వారా ఉద్దేశపూర్వకముగా 'ఏ' చే 'సీ' ని పట్టుకొనునట్లు చేయించును. ఇచట, పురికొల్పుట ద్వారా 'సీ' ని పట్టు కొనుటకు 'బీ' దుష్ప్రేరణ చేసిన వాడగును.

విశదీకరణము 2:--ఒక కార్యము చేయుటకు ముందు గాని, చేయుచున్నప్పుడు గాని, ఆ కార్యమును సుకరము చేయుటకై ఏ పనినైనను చేసి, తద్వారా ఆ కార్యమును సుకరము చేయు వారెవరైనను, ఆ కార్యము చేయుటకు తోడ్పడినట్లు చెప్పబడుదురు.